నయీమ్‌ కేసులో మంత్రాంగం! | Sakshi
Sakshi News home page

నయీమ్‌ కేసులో మంత్రాంగం!

Published Wed, May 17 2017 12:39 AM

నయీమ్‌ కేసులో మంత్రాంగం! - Sakshi

- సీనియర్‌ మంత్రిని రంగంలోకి దించిన ‘నయీమ్‌ ఖాకీలు’
- ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని వారికి మంత్రి హామీ  


సాక్షి, హైదరాబాద్‌: నయీమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తదుపరి చర్యల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. నయీమ్‌తో లింకులపై మౌఖిక విచారణ, క్రిమినల్‌ కేసుల నుంచి బయటపడేందుకు ఓ రిటైర్డ్‌ డీజీపీ ద్వారా ఒత్తిడి తేవాలనుకున్నా అది బెడిసికొట్టడంతో తాజాగా కులంకార్డును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో సామాజికవర్గపరంగా కేవలం తమను మాత్రమే టార్గెట్‌ చేసి మిగతా అధికారులను మైనర్‌ పనిష్మెంట్లతో సరిపెట్టి కాపాడారని ఆరోపిస్తూ ఓ సీనియర్‌ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమను గట్టెక్కించాలని ఆరుగురు అధికారులు మంత్రిని కలసి వేడుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డీజీపీయే టార్గెట్‌...
ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ ఇప్పటివరకు తమ వర్గం అధికారులను ఏ ప్రభుత్వం టార్గెట్‌ చేయలేదని, చేసేందుకు కూడా ప్రయత్నించలేదని ఆరోపణలెదుర్కుంటున్న అధికారులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో డీజీపీ అనురాగ్‌ శర్మపైనే ఫిర్యాదు చేయాలని సీనియర్‌ మంత్రికి సంబంధిత అధికారులు సూచించారని తెలిసింది. నయీమ్‌ కేసులో ఎనిమిది నెలల నుంచి చర్యలకు సాహసించని డీజీపీ ఒకేసారి ఇంత మంది అధికారులపై వేటు వేయడం వెనకున్న అసలు నిజాలు బయటకు రావాలని మంత్రి భావిస్తున్నారని తెలిసింది. దీనంతటికీ ప్రధాన కారణంగా ఉన్న డీజీపీ అనురాగ్‌ శర్మపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయాలని సీనియర్‌ మంత్రి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సస్పెండ్‌ అయిన ఐదుగురిలో ముగ్గురు, విచారణ ఎదుర్కోనున్న మరో ముగ్గురు అధికారులు ఒకే సామాజికవర్గం వారు కావడంతో సీఎం వద్దే తేల్చుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement