లొంగిపోయిన రావెల సుశీల్ | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన రావెల సుశీల్

Published Sun, Mar 6 2016 6:28 AM

లొంగిపోయిన రావెల సుశీల్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు రావెల సుశీల్(24), అతని కారు డ్రైవర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి లొంగిపోయారు. స్టేషన్ బెయిల్ కోసం రావెల సుశీల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. నిందితులిద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం వారిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. మొదట ఐపీసీ సెక్షన్ 509 ఈవ్‌టీజింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిర్భయ చట్టాన్ని అదనంగా చేర్చారు. బాధితురాలు ఫాతిమా బేగం ఫిర్యాదు మేరకు మొదట సుశీల్ కారు డ్రైవర్ అప్పారావుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు నిందితుడిని వదిలేయడంపై ఫాతిమా పోలీసులను ప్రశ్నించడంతో పాటు మీడియాను ఆశ్రయించడంతో సుశీల్‌పై ఈవ్‌టీజింగ్‌తో పాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 3న సాయంత్రం బంజారాహిల్స్‌లోని అంబేడ్కర్‌నగర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా స్కూల్ నుండి ఇంటికి నడిచి వెళుతుండగా సుశీల్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

నిందితులు సుశీల్, అప్పారావులకు సీఆర్‌పీసీ 41(ఎ) కింద జారీ చేసిన నోటీసులు అందుకోవడానికి మంత్రి కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. దీంతో మంత్రి రావెల వ్యక్తిగత కార్యదర్శికి పోలీసులు నోటీసులు అందించారు. విచారణ నిమిత్తం రెండు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని, గడువులోగా హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని స్పష్టంచేశారు. మరోవైపు మంత్రి కిశోర్‌బాబు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి తన కుమారుడు సుశీల్‌ను సోమవారం అప్పగిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. చివరకు శనివారం రాత్రి సమయంలో బంజారాహిల్స్ పీఎస్లో రావెల సుశీల్ లొంగిపోయాడు. రావెల సుశీల్, డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించారు. స్టేషన్ బెయిల్ కోసం రావెల సుశీల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

 
సీసీ కెమెరాల్లో వెంటాడిన దృశ్యాలు...
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నం.13లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఇందులో నడుచుకుంటూ వెళుతున్న ఫాతిమాను సుశీల్  వాహనం వెంటాడటం, ఆమె పక్కనే తీసుకువచ్చి నిలపడం, కారు అద్దాన్ని దించి ఏవో మాట్లాడటం కనిపించాయి. సీసీ కెమెరాల్లో రికార్డు కాని వివరాలను బాధితురాలితో పాటు స్థానికుల నుండి పోలీసులు తెలుసుకున్నారు.
 
కుక్కపిల్ల అడ్డొచ్చింది: ఫేస్‌బుక్‌లో సుశీల్
గురువారం తాను కారులో ఇంటికి వెళుతుండగా బంజారాహిల్స్ రోడ్ నం.13 వద్ద కుక్కపిల్ల అడ్డురావడంతో కారును ఆపానని, ఆ కుక్కను పక్కకు తీసేంతలో ఓ యువతి అక్కడికి వచ్చిందని, కారణం లేకుండానే తిట్టడం మొదలెట్టిందని సుశీల్ శనివారం ఉదయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తాను స్పందించేలోగానే ఆమె గొడవ విని చుట్టుపక్కల వారు వచ్చారని, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. అయితే కుక్కపిల్ల అడ్డొచ్చిందని సుశీల్ చెప్పిన మాటలకు.. పోలీసులు విడుదల చేసిన సీసీ కెమెరా దృశ్యాలకు పొంతనే లేదు. అసలు ఆ ఫుటేజీల్లో ఎక్కడా కుక్క పిల్ల లేకపోవడం గమనార్హం.
 
అప్పారావు కాదు.. రమేశ్

అప్పారావు అనే డ్రైవర్‌తో పాటు సుశీల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫాతిమా చెప్పిన ప్రకారం పోలీసులు అప్పారావు పేరుతో కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో కారులో ఉన్న డ్రైవర్ అప్పారావు కాదని అతని పేరు రమేష్ అని దర్యాప్తులో తేలింది. శుక్రవారం రాత్రి ఫాతిమా ఫిర్యాదును రికార్డు చేయగా ఆమె చెప్పిన వివరాల ప్రకారం డ్రైవర్ పేరు రమేష్ అని తేలింది. స్థానికుల దాడిలో గాయపడినది కూడా రమేషే. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రమేష్‌కు వైద్యులు చికిత్స చేసి శనివారం డిశ్చార్జ్ చేశారు. ఇంతకూ అప్పారావు ఎవరని పోలీసులు ఆరా తీయగా మంత్రి ఇంట్లో పనిచేసే అటెండర్ పేరు అప్పారావు అని తేలింది.
 
పక్కా ఆధారాలతో ముందుకు: డీసీపీ
ప్రైవేట్ స్కూల్ టీచర్ ఫాతిమా ఫిర్యాదుపై పకడ్బందీ విచారణతో ముందుకు వెళుతున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఫాతి మా ఫిర్యాదును విచారిస్తే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తుల్లో ఏపీ మంత్రి రావెల కిషోర్‌రాబు కొడుకు సుశీల్ ఉన్నాడని తేలిందన్నా రు. అయితే ఈ విషయంలో పోలీసులు ఎక్కడా ఒత్తిళ్లకు లొంగలేదని, ఓ పద్ధతి ప్రకారం విచారణను పక్కా ఆధారాలతో ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు.

 
 బాధితురాలి ముందుకు నిందితులు

మరోవైపు రావెల సుశీల్‌తో పాటు అతని డ్రైవర్‌ను పోలీసులు బాధితురాలు ఫాతిమా ముందు హాజరుపర్చనున్నారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని బాధితురాలు గుర్తించాల్సి ఉంటుంది.  తొలిసారిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో టీఐబీ అనే ఈ తరహా గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్ట నున్నారు.
 

Advertisement
Advertisement