టీడీపీ సర్వేలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫెయిల్! | Sakshi
Sakshi News home page

టీడీపీ సర్వేలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫెయిల్!

Published Sat, Aug 1 2015 8:05 PM

ministers and mlas could not get pass marks in tdp own survey

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో.. ఘోరమైన ఫలితాలు వెలువడ్డాయి. మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఈ సర్వే ఆధారంగా ర్యాంకింగులు ఇచ్చారు. ఎమ్మెల్యేల ఈ మెయిళ్లకు సర్వే నివేదికను పంపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఎమ్మెల్యేలకు జిల్లాల స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా విడివిడిగా ర్యాంకులు ఇచ్చారు. ఎక్కడా టీడీపీ ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా దక్కలేదు. కేవలం 33 శాతం మంది కార్యకర్తలు మాత్రమే ఎమ్మెల్యేల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే.. ఏడు ప్రభుత్వ పథకాలపై టీడీపీ సర్వే చేయించగా, అన్నిచోట్లా తీవ్ర అసంతృప్తి పెల్లుబికింది. ఎనిమిదో కాలమ్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు అడిగారు. కీలక పథకాలన్నింటిపైనా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయమై కూడా అసంతృప్తి వ్యక్తమైనట్లు టీడీపీ సర్వేలోనే నిగ్గుతేలింది. ఇసుక పాలసీ విషయంలో కూడా ప్రజలు పెదవి విరిచారు. ఆరోగ్యశ్రీ మాత్రం కాస్త మెరుగ్గా ఉందన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై టీడీపీ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. ఈ విషయాన్ని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే వెల్లడించారు. పింఛన్ల పంపిణీలో విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడుకు మొదటి స్థానం దక్కింది.

Advertisement
Advertisement