నయీమ్ కీ కహానీ! | Sakshi
Sakshi News home page

నయీమ్ కీ కహానీ!

Published Sat, Aug 13 2016 2:30 AM

నయీమ్ కీ కహానీ! - Sakshi

స్వీయ చరిత్రను తెరకెక్కించేందుకు గ్యాంగ్‌స్టర్ యత్నాలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ అం తకుముందే తన జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడా? ఆ చిత్రంలో తన నెగెటివ్ ఇమేజ్‌కు ముసుగేసి ‘పాజిటివ్’గా చూపించుకోవాలని ఆరాటపడ్డాడా? అందుకు తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు కూడా జరిపాడా? అవుననే అంటున్నారు పోలీసులు. నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లోని ఇందుకు సంబంధించిన విషయాలున్నాయని వారు చెబుతున్నారు. భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేసిన  నయీమ్ ఆ సన్నాహాల్లో భాగంగానే తన సినిమానూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించినట్లు తెలిసింది.
 
రాజకీయ సన్నాహాల్లో భాగంగానే..
కరుడుగట్టిన నేరగాడైన నయీమ్‌కు మాజీ మావోయిస్టుగా, గ్యాంగ్‌స్టర్‌గానే పేరుంది. ఇతడి ఆగడాలు, చేసిన దారుణాలకు అంతే లేకపోవడంతో స్థానికంగానూ చెడ్డపేరు ఉంది. ఈ ఇమేజ్‌తో రాజకీయాల్లో అడుగుపెట్టడం, రాణించడం కష్టమంటూ నయీమ్‌కు ‘సన్నిహితులు’ సలహా ఇచ్చారు. దీంతో నెగెటివ్ ఇమేజ్ పొగొట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్ ప్లాంట్స్ నిర్మాణానికి అతడు యత్నంచినా ఫలించలేదు.

ఈ నేపథ్యంలోనే నయీమ్ దృష్టి రాయలసీమ ఫ్యాక్షనిజం ప్రధానంగా వచ్చిన ‘రక్త చరిత్ర’ చిత్రాలపై పడింది. అదే మాదిరిగా తన స్వీయచరిత్రను తెరకెక్కించాలని భావించాడు. నయీమ్ గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్‌కు తరచుగా వెళ్లేవాడు. ఇది సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చేది కావడంతో అక్కడ పరిచయమైన వారి ద్వారానే తన సినిమాను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.
 
‘సక్సెస్’ కోణాన్ని చూపించుకోవాలని..
ఈ చిత్రంలో తనలోని నెగెటివ్ అంశాలను కాకుండా ‘పాజిటివ్’ అంశాలనే చూపించి, వాటినే ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నయీమ్ భావించాడు. తన భూకబ్జాలు, దందాలు వంటి నేర జీవితాన్ని మినహాయించి మావోయిస్టుగా తాను చేసిన పనులు, ఉద్యమం నుంచి బయటకు వచ్చాక మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లతో పాటు పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేసినప్పుడు తన ద్వారా అధికారులు సాధించిన ‘సక్సెస్’లు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఇందుకు తన డైరీల్లో రాసుకున్న అనేక కీలకాంశాలను నెమరు వేసుకున్నాడని సమాచారం. తెలుగు సినీ రంగానికి చెందిన ఇద్దరు ద్వితీయ శ్రేణి దర్శకులతో నయీమ్ సంప్రదింపులు జరిపాడు. చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధులు తానే ఇస్తానని, సినిమా తీయాలని వారిని కోరినట్లు తెలిసింది. 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో 2018 ద్వితీయార్థం లేదా 2019 ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదలయ్యేలా నయీమ్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
 
అక్కడా ఓ ‘పోలీసు’తో పరిచయం
చిత్ర నిర్మాణంపై ప్రాథమిక చర్చలు గోవాలో నయీమ్‌కు ఉన్న కోకోనట్ గెస్ట్‌హౌస్‌లో జరిగినట్లు తెలిసింది. సదరు దర్శకులతో కలసి రోడ్డు మార్గంలో అక్కడకు వెళ్లిన నయీమ్ 3 రోజుల పాటు సినిమాపై చర్చించాడు. ఈ సందర్భంలో నయీమ్‌తోపాటు ఓ మహిళ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. సదరు దర్శకుల్లో ఒకరి సలహా మేరకే... పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చడం, మేకప్ కిట్స్ వినియోగించడంవంటివి ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సినీ రంగంతో మంచి పరిచయాలున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారితో కూడా నయీమ్‌కు జూబ్లీహిల్స్ క్లబ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ అధికారికి నయీమ్‌తో ఉన్న సంబంధాలు ఏమిటన్న అంశంపై పోలీసు వర్గాలు దృష్టి పెట్టి కూపీ లాగుతున్నాయి.

Advertisement
Advertisement