ఎస్టీ బిల్లుకు మద్దతు,ముస్లిం బిల్లుకు వ్యతిరేకం | Sakshi
Sakshi News home page

ఎస్టీ బిల్లుకు మద్దతు,ముస్లిం బిల్లుకు వ్యతిరేకం

Published Mon, Apr 17 2017 1:04 AM

ఎస్టీ బిల్లుకు మద్దతు,ముస్లిం బిల్లుకు వ్యతిరేకం - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లులో రెండు ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయని.. ఎస్టీల రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ బద్ధమైనది కాగా, ముస్లిం రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైనదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తాజా బిల్లు అంశమూ కోర్టుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను పెంచడానికి మద్దతు తెలుపుతున్నామని, ముస్లిం రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతకు ముందు బిల్లుపై చర్చలో రామచంద్రరావు మాట్లాడుతూ.. ముస్లింల వెనుకబాటుదనంపై ప్రధాని మోదీ భువనేశ్వర్‌లో చేసిన వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్‌ తెలివిగా తనను ఇరికించే ప్రయత్నం చేశారని నవ్వుతూ అన్నారు. శివలింగంపై తేలు ఉంటే దాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే కుడుతుందని, అలాగని చెప్పుతో కొట్టలేమని.. ప్రస్తుతం తమ పరిస్థితి ఇలా ఉందంటూ చలోక్తి విసిరారు. రాష్ట్రంలో జనాభా నిష్పత్తిని బట్టి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాల్సిందేనని, అయితే ఈ బిల్లులో ముస్లింలు అనే ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కేసే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఇక పెంచిన 12 శాతానికీ అదే గతి పడుతుందన్నారు.

Advertisement
Advertisement