Sakshi News home page

ఆధునిక ఎండోస్కోపితో మధుమేహానికి చెక్

Published Sun, Feb 21 2016 4:00 AM

ఆధునిక ఎండోస్కోపితో మధుమేహానికి చెక్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపి విధానంతో టైప్-2 డయాబెటిక్‌ను పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని, అటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు కొన్ని దేశాల్లో అమల్లోకి వచ్చాయని అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మధుమేహంతో ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని, ఎండోస్కోపిలో ప్రత్యేక విధానం ద్వారా పూర్తిగా నయం చేయొచ్చని స్పష్టంచేశారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే ఆధునిక ఎండోస్కోపిక్ విధానం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే అల్సర్స్ వచ్చి రక్తస్రావమైతే నయం చేసే పద్ధతులూ ఉన్నాయన్నారు.

జీఐ ఎండోస్కోపిపై వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎండో-2017 ప్రపంచ సదస్సు సన్నాహక సమావేశం శనివారమిక్కడ జరిగింది. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, జపాన్, కొరియా, హాంకాంగ్ తదితర దేశాల వైద్య నిపుణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘సైంటిఫిక్ చైర్’గా నియమితులైన, ప్రపంచ ఎండోస్కోపి సంస్థకు అధ్యక్షులుగా ఎంపికైన డాక్టర్ జీన్ ఫ్రాంకోయిస్ రే, ప్రపంచ సదస్సు అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డితోపాటు ఆయా దేశాల గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు మాట్లాడారు. మొదటిసారిగా భారత్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు.

80 దేశాల నుంచి 5 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. అల్సర్లు, కేన్సర్ల వ్యాధి నిర్ధారణకు మొదట్లో ఎండోస్కోపిని ఉపయోగించేవారని, గత దశాబ్ద కాలంలో వ్యాధి నిర్ధారణ ప్రక్రియ నుంచి చికిత్సా విధానంగా రూపాంతరం చెందిందన్నారు. గ్యాస్ట్రోఇంటైస్టైనల్ రుగ్మతలకు అందించే చికిత్సా విధానంలో జీఐ ఎండోస్కోపి విప్లవాత్మక మార్పులను తెచ్చిందన్నారు. ప్రత్యేకమైన క్యాప్సుల్స్‌ను కూడా ఎండోస్కోపి నిపుణులు కనుగొన్నారని, వాటిద్వారా శరీరంలో ఏ భాగంలో దేన్ని నయం చేయాలో బయటనుంచే నియంత్రించవచ్చని తెలిపారు. ఈజిప్టులో రక్తంతో కూడిన వాంతులు అధికమని, హెపటైటిస్-బితో ఆ దేశంలో 10 శాతం మంది బాధపడుతున్నారన్నారు. కేన్సర్లను, ట్యూమర్లను గుర్తించి ఆపరేషన్ లేకుండా వైద్య చికిత్స చేయవచ్చన్నారు. హైదరాబాద్‌లోని తమ ఆసుపత్రిలోనూ టైప్-2 డయాబెటిక్‌ను నయం చేయడానికి శ్రీకారం చుడుతున్నామని, త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement