‘పాలమూరు’ ప్యాకేజీలపై పీటముడి! | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ ప్యాకేజీలపై పీటముడి!

Published Mon, Dec 28 2015 4:26 AM

‘పాలమూరు’ ప్యాకేజీలపై పీటముడి! - Sakshi

సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పనులను ఎన్ని ప్యాకేజీలుగా విభజించాలన్న విషయం కొలిక్కి రావడంలేదు. వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలుగా విభజించాలని అధికారులు, తెలంగాణ కాంట్రాక్టర్లు కోరుతుంటే, దానికి భిన్నంగా ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఉన్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో ‘పాల మూరు’ ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు, డిండి ఎత్తిపోతల చేర్పుతో ప్రాజెక్టు వ్యయం రూ.40 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. ప్రాజెక్టులోని ఆరు రిజర్వాయర్లకుగానూ ఐదింటి అంచనాలు సిద్ధమయ్యాయి. పంప్‌హౌస్‌లు, ఓపెన్ చానళ్లకు సంబంధించి సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనుల అంచనాలన్నీ సిద్ధమయ్యాయి. వీటిపై తుది పరిశీలన సాగుతోంది. అది పూర్తయిన వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.

 పెద్ద ప్యాకేజీలకే ప్రభుత్వం సుముఖం!
 టెండర్లను పిలిచే కన్నా ముందు పనులను ఎన్ని ప్యాకేజీలుగా విభజించాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రాజెక్టును గరిష్టం గా నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం మేరకు పనులు పూర్తి కావాలంటే ఒక్కో పనిని కనిష్టంగా రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్లుగా విభజించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు సైతం ఈ విషయమై సీఎం, మంత్రిని కలసి విన్నవించారు. చిన్న, చిన్న ప్యాకేజీలు అయితేనే పనులు త్వరితగతిన పూర్తవుతాయని, రాష్ట్ర కాంట్రాక్టర్లకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

పెద్ద ప్యాకేజీలను నిర్ణయిస్తే మళ్లీ ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్లే ముందుం టారని ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. కాగా రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల మధ్యలో ప్యాకేజీలను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాంకేతిక పనుల్లో పెద్దగా అనుభవంలేకపోవడంతోపాటు మొబిలైజే షన్ అడ్వాన్స్‌లు లేనందున ముందుగానే పరికరాలు, యంత్రాల కొనుగోలు, వాటి నిర్వహణ ఖర్చును చిన్న కాంట్రాక్టర్లు భరించలేరని ప్రభుత్వం భావిస్తోంది. బడా కాంట్రాక్టు సంస్థలయితే అడ్వాన్సులు ఇవ్వకున్నా వాటికి యంత్ర సామగ్రిని సమకూర్చుకునే సామర్ధ్యం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై బడా కాంట్రాక్టు సంస్థలు సైతం ప్రభుత్వాన్ని ప్రభావితం చేసినందునే పెద్ద ప్యాకేజీల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement
Advertisement