పురపాలికలపై సమదృష్టి | Sakshi
Sakshi News home page

పురపాలికలపై సమదృష్టి

Published Wed, Feb 17 2016 4:16 AM

పురపాలికలపై సమదృష్టి - Sakshi

జీహెచ్‌ఎంసీ తరహాలోనే అభివృద్ధి ప్రణాళికలు: కేటీఆర్
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను సమాన దృష్టితో చూస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ప్రతి మునిసిపాలిటీని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పురపాలక శాఖ బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో కన్నా నగర, పట్టణ ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి పనులు పెరిగినందున ఆ మేరకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెరుగుతాయని ఆయన తెలిపారు. నూతన మార్కెట్లు, నగర పంచాయతీల కార్యాలయ భవనాలు, స్మశాన వాటికల నిర్మాణాలు, పారిశుద్ధ్య వాహనాల కొనుగోలు వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

నగరంలోని చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేకంగా ‘అర్బన్ ట్యాంక్ రెనోవేషన్ అండ్ డెవలప్‌మెంట్’ పేరిట కేటాయింపులు చేస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రజలు చూడగలిగే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఆ దిశగానే బడ్జెట్ ఉండబోతున్నదన్నారు. అనంతరం వంద రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలపై విభాగాధిపతుల వారీగా మంత్రి చర్చించారు. వంద రోజుల్లో ప్రతి శాఖ ఏఏ అంశాలను అభివృద్ధి చేస్తాయో చెప్పాలని, ఈ మేరకు ఒక నివేదికను ప్రజల ముందు ఉంచాలన్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, కమిషనర్ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement