Sakshi News home page

‘ముసద్దీలాల్‌’ డైరెక్టర్‌ కైలాశ్‌గుప్తా అరెస్టు

Published Thu, Dec 29 2016 4:17 AM

‘ముసద్దీలాల్‌’ డైరెక్టర్‌ కైలాశ్‌గుప్తా అరెస్టు

ఆశ్రయం కల్పించిన వ్యక్తీ కటకటాల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు రాత్రి మూడు గంటల వ్యవధిలో బోగస్‌ పత్రాలు, రసీదులతో సుమారు వంద కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. దాని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదైన కేసుకు సంబంధించి వీటి డైరెక్టర్‌గా ఉన్న కైలాశ్‌చంద్‌గుప్తాను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) రికార్డుల్నీ తారుమారు చేశారని డీసీపీ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న కైలాశ్‌గుప్తాకు ఆశ్రయం కల్పించిన అతడి బంధువు సాగర్‌ పెట్రోలియం ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ నరేందర్‌ కుమార్‌నూ అరెస్టు చేసినట్లు తెలిపారు. ముసద్దీలాల్‌ సంస్థలకు కైలాశ్‌ ఆయన కుమారులు నితిన్‌గుప్తా, నిఖిల్‌గుప్తా, కోడలు నేçహాగుప్తా తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు.

నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్‌ 8 రాత్రి వీరంతా కలసి తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాలని కుట్ర పన్నారు. దీనికోసం ఆ రోజు రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల మధ్య 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదులు సృష్టించారు. దీనిపై ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల అరెస్టుపై న్యాయస్థానం ఇచ్చిన స్టే ఇటీవల తొలగిపోవడంతో వీరు తమ సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డుల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. రెండు రోజులు ఒకే ఇంట్లో ఉండకుండా ఆశ్రయం పొందుతున్నారు. కైలాశ్‌.. నరేంద్రకుమార్‌కు చెందిన మణికొండలోని ఇంటితో పాటు ఆటోనగర్‌లోని ఫ్యాక్టరీలో ఆశ్రయం పొందాడు. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు బుధవారం దాడి చేసి కైలాశ్‌తో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన నరేంద్రను అరెస్టు చేశారు.

వినియోగదారుల పరిశీలన ప్రారంభం..
నోట్ల రద్దు ప్రకటన రోజు ముసద్దీలాల్‌ యాజమాన్యం రూపొందించిన బోగస్‌ బిల్లుల ప్రకారం ప్రతి వినియోగదారుడు రూ.1.89 లక్షల బంగారం ఖరీదు చేశాడు. ఈ రసీదులతో పాటు మరికొన్ని ధ్రువీకరణల్నీ జత చేసింది. ఇవి బోగస్‌ అనే అనుమానంతో సీసీఎస్‌ పోలీసులు క్రాస్‌ వెరిఫికేషన్‌ ప్రారంభించారు. ఆ గుర్తింపు పత్రాల ఆధారంగా సంబంధీకుల్ని పిలిపించి విచారిస్తున్నారు. ముసద్దీలాల్‌ యాజమాన్యం నవంబర్‌ 8న తమ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌లోనూ మార్పుచేర్పులు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే అరెస్టుల్ని తప్పించుకునేందుకు ముసద్దీలాల్‌ సంస్థలకు వేరే వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొంటూ ఆర్‌వోసీ రికార్డుల్నీ తారుమారు చేశారు. ముసద్దీలాల్‌ యాజమాన్యం గతంలో ఐటీ విభాగంతో సంప్రదింపులు జరిపినప్పుడు తాము ఆ రోజు చేసిన రూ.97.85 కోట్ల వ్యాపారంలో రూ.10 కోట్ల వరకు లాభం వచ్చిందని, ఆ మేరకు పన్ను చెల్లిస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత రూ.97.85 కోట్ల వ్యాపారానికి సంబంధించి రూ.75 కోట్ల వరకు పన్ను చెల్లిస్తామంటూ ఐటీ విభాగంతో చెప్పినట్లు సమాచారం.

ముసద్దీలాల్‌ డైరెక్టర్లకు ముందస్తు బెయిల్‌  
పాత నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమంగా పెద్ద ఎత్తున బంగారం విక్రయించారంటూ సీసీఎస్‌ అధికారులు నమోదు చేసిన కేసులో ముసద్దీలాల్‌ జ్యుయెల్లర్స్, వైష్ణవి బులియన్‌ డైరెక్టర్లు నితిన్‌గుప్తా, నిఖిల్‌గుప్తా, నరేందర్‌జీ, వినుత బొల్లా, మల్లేశ్‌లకు నాంపల్లి కోర్టు తాత్కాలిక ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ వీరిని అరెస్టు చేయరాదని మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి డి.తిరుమలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు సహకరించడం లేదనే పేరుతో ముసద్దీలాల్‌ జ్యుయెలర్స్‌ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని, వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వారి తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించిన అనంతరం వీరికి తాత్కాలికంగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ విచారణను శనివారానికి వాయిదా వేశారు. కాగా, ఇదే కేసులో నిందితునిగా ఉన్న మరో డైరెక్టర్‌ కైలాశ్‌గుప్తాను అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

What’s your opinion

Advertisement