‘మన టీవీ’కి కొత్తరూపు | Sakshi
Sakshi News home page

‘మన టీవీ’కి కొత్తరూపు

Published Sat, Aug 6 2016 2:58 AM

New Look to Mana Tv

* చానల్స్ పెంచే యోచన
* శాటిలైట్ మార్పుపై నేడు ఇస్రోతో చర్చలు  

సాక్షి, హైదరాబాద్: పాఠశాలతో పాటు సాంకేతిక, ఉన్నత విద్య బోధనలో కీలకంగా పనిచేస్తున్న అధికారిక చానల్ ‘మన టీవీ’ ప్రసారాలకు కొత్త రూపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ప్రస్తుతం ‘జీ శాట్-8’ ఉపగ్రహం ద్వారా మన టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతుండగా.. ‘జీ శాట్-15’లోకి మార్చాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్‌తో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ‘సాఫ్ట్‌నెట్’ (సొసైటీ ఫర్ తెలంగాణ నెట్‌వర్క్) ద్వారా మన టీవీ కార్యక్రమాలు ప్రస్తుతం 4 చానల్స్ ప్రసారం అవుతున్నాయి.

వీటి సంఖ్యనూ పెంచాలని ప్రభుత్వం యో చిస్తోంది. అయితే ప్రసారాలను నిర్దేశిత గ్రూపులకు చేరవేసేందుకు సాఫ్ట్‌నెట్ అనేక సాంకేతిక అవరోధాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో శాటిలైట్ మార్పు ద్వారా దూరదర్శన్ తరహాలో అందరికీ మనటీవీ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కాగా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, మాతా శిశు సంక్షేమం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షలు తదితరాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని మన టీవీ సీఈఓ శైలేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement
Advertisement