Sakshi News home page

భువనగిరి కోటకు కొత్త కళ

Published Wed, Jul 6 2016 2:51 AM

భువనగిరి కోటకు కొత్త కళ

- తెలంగాణలో తొలి రోప్ వే ఏర్పాటు
- కోటపై సౌండ్ అండ్ లైట్ షో,లేజర్ షో, మ్యూజియం నిర్మాణం
 
 సాక్షి, హైదరాబాద్ : అటు గోల్కొండ కోట... ఇటు ఓరుగల్లు కోట.. మధ్యలో భువనగిరి కోట. పదో శతాబ్దంలో నిర్మితమైన అద్భుత కట్టడం. ఒకప్పుడు గొప్ప చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ కోట ఆ తర్వాత ప్రాభవాన్ని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు ఇది ఓ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకునేందుకు సిద్ధమైంది. దేశవిదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా రూ.50 కోట్లతో కోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం అయింది. వచ్చే నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

 సాహస క్రీడలకు వేదికగా...
 ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ నుంచి కూడా ఆ సాహసాన్ని చేసి చూపుతున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భువనగిరి కోటను సాహస క్రీడలకు వేదికగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పర్వతారోహకులకు నిపుణుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించటం విశేషం. ఇప్పటికే ఇక్కడ ఓ కేంద్రం ఏర్పాటు కాగా, పలు పనులు కొనసాగుతున్నాయి. గుట్టపైనున్న రాణీమహల్‌కు వెళ్లటం పర్యాటకులకు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో తొలి రోప్ వేను నిర్మించనున్నారు. అలాగే సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, ఓ భారీ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సౌండ్ అండ్ లైట్ షో, కోటపైనే ప్రదర్శనశాల, లేజర్ షోనూ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

 350 మీటర్ల దూరం నుంచి రోప్ వే...
 గుట్టను ఆనుకునే పట్టణం వైపు ఇళ్లు భారీగా వెలియడంతో ప్రవేశద్వారం వద్ద స్థలం లేదు. దీంతో అక్కడి నుంచి 350 మీటర్ల దూరంలో మూడెకరాల ప్రైవేటు భూమిని సమీకరించారు. ఆ స్థలంలో కేంద్రాన్ని నిర్మించి గుట్టపైకి రోప్‌వేను ఏర్పాటు చేస్తారు. నాలుగు సీట్లుండే.. ఎనిమిది టబ్‌లుండేలా ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. త్వరలో దీని నిర్మాణానికి సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మూడు ఎకరాల్లోనే ఓ రెస్టారెంట్‌తో పాటు విశ్రాంతి గదులను నిర్మిస్తారు.

 వచ్చే నెలలో పనులకు శ్రీకారం: చందూలాల్
 భువనగిరి కోటను ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వచ్చే నెలలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు పర్యాటక మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ సలహాదారు రమణాచారి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పర్యాటక కార్యదర్శి వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా చోంగ్తు, పురావస్తు సంచాలకులు విశాలాక్షి తదితరులతో సమీక్షించారు.

Advertisement

What’s your opinion

Advertisement