వాడి బాధ చూడలేకపోతున్నాం.. చికిత్స నిలిపేయండి | Sakshi
Sakshi News home page

వాడి బాధ చూడలేకపోతున్నాం.. చికిత్స నిలిపేయండి

Published Tue, Jun 7 2016 3:56 AM

వాడి బాధ చూడలేకపోతున్నాం.. చికిత్స నిలిపేయండి

వైద్యుడికి నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రుల అభ్యర్థన
 
 సాక్షి, హైదరాబాద్: మూడు ఇంచుల ఎత్తు పెంపు కోసం కాళ్లకు శస్త్రచికిత్స చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్‌రెడ్డి కోరిక నెరవేరకుండానే చికిత్స ప్రక్రియ నిలిచిపోయింది. తమ కొడుకు రోజూ పడుతున్న నరకయాతన  చూడలేకపోతున్నామని, రెండు కాళ్లలో ‘ఇల్‌జర్వ్’ పద్ధతిలో వేసిన రాడ్లతో ఎముకల పెంపు చికిత్సను నిలిపేయాల్సిందిగా తండ్రి గోవర్ధన్‌రెడ్డి వైద్యులను కోరారు. ఈ మేరకు వీడియో ఫుటేజీతో పాటు, లిఖిత పూర్వక లేఖను గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్‌కు అందజేశారు.

రెండు మాసాల్లో నిఖిల్‌రెడ్డి కాళ్ల ఎముకలు 1.1 ఇంచుల మేర పెరిగాయని వైద్యులు చెబుతుంటే... పెరిగింది కండ మాత్రమేనని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. నొప్పుల బాధ భరించలేక రోజూ మూడు పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అనైతికంగా, అశాస్త్రీయంగా తన కుమారుడికి చేసిన శస్త్రచికిత్స విఫలమైందని గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరెవరూ తన కుమారుడిలా బాధ పడకూడదని, ఈ విషయంలో  న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.

 మెడికల్ కౌన్సిల్ విచారణ: నిఖిల్‌రెడ్డి శస్త్రచికిత్సపై ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణను ముమ్మరం చేసింది. నిఖిల్ ఆరోగ్య పరిస్థితి, వైద్యులు ఏం చెప్పారు తదితర వివరాలు ఇవ్వాలని అతడి తండ్రి గోవర్ధన్‌రెడ్డికి లేఖ పంపించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement