నన్ను ఎవరూ ఏం చేయలేకపోయారు: బాబు | Sakshi
Sakshi News home page

నన్ను ఎవరూ ఏం చేయలేకపోయారు: బాబు

Published Mon, Mar 14 2016 5:13 PM

నన్ను ఎవరూ ఏం చేయలేకపోయారు: బాబు - Sakshi

హైదరాబాద్ : శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం సమాధానం చెప్పలేక ఎదురు దాడికి యత్నించింది. సభలో చర్చను పూర్తిగా పక్కదోవ పట్టించి, ప్రతిపక్ష సభ్యులను బెదిరించే ధోరణికి దిగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో జరిగిన కుంభకోణాలను వైఎస్ జగన్ సభలో ప్రస్తావించారు. దీంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష సభ్యులపై  పరుష పదాలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.  అంతేకాకుండా '35 ఏళ్లుగా నీతి నిజాయితీలతో బతుకుతున్నా. నన్ను ఎవరూ ఏం చేయలేకపోయారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన ఇస్తున్నాం. అసత్య ఆరోపణలు, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలు ఉండాలి. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటాం. లేకుంటే ఆరోపణలు చేసినవారిపై చర్చలు తీసుకోవాలి. మంత్రులపై ఆరోపణలు చేశారు. నిరూపించమంటే పారిపోయారు. అవినీతిపై నిరూపించేందుకు సిద్ధమా లేకుంటే క్షమపణలు చెప్పండి. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మీ ప్రతిపక్ష నేతను తప్పించి, ఆయన స్థానంలో ఎవరైనా ప్రతిపక్ష నేత కండి. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతున్నా. అంతేకాదు అవినీతికి పాల్పడివారిపై చండశాసనుడిగా ఉంటా' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన సవాల్ పై వైఎస్ జగన్ స్పందన పూర్తి కాకముందే మరోసారి మైక్ కట్ అయింది.
 
కాగా చంద్రబాబు సర్కార్పై 20 అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయితే కేవలం 2 ఆరోపణలపైనే విచారణ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. దమ్ము, ధైర్యముంటే 20 ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. రాజధాని భూ దందాపై సీబీఐ విచారణ అడిగాం. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరోపణలు చేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement