ఆ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులేవీ? | Sakshi
Sakshi News home page

ఆ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులేవీ?

Published Tue, Aug 16 2016 2:40 AM

ఆ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులేవీ?

నెల రోజులుగా ఖాళీగా ఉన్న 33 మంది అధికారులు
ప్రమోషన్లు ఇచ్చి ఖాళీగా ఉంచిన సర్కారు

 సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా కూర్చోబెట్టింది. ఓవైపు అధికారుల కొరతతో సతమతం అవుతున్నా, జిల్లాల్లో పాలన కుంటుపడుతున్నా.. 33 మందికి పోస్టింగులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా రెగ్యులర్ డిప్యూటీ కలెక్టర్లలో 8 మంది, గత నెల 12న తహసీల్దారు నుంచి పదోన్నతి పొందిన 25 మంది డిప్యూటీ కలెక్టర్లు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు.

 హైకోర్టుకు భయపడి పదోన్నతులు!
హైకోర్టు అక్షింతలు వేస్తుందేమోనన్న ఆందోళనతోనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా 25 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందినవారందరూ వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు రిపోర్ట్ చేశారు. ఇవి రాష్ట్రస్థాయి పోస్టులు కావడంతో.. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన వెంటనే తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. కొంతమందైతే వ్యక్తిగత కారణాలను తెలుపుతూ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే నియమించాలని వినతిపత్రాలు సమర్పించారు. కానీ నెలరోజులు దాటినా పోస్టింగుల ఊసెత్తకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

Advertisement
Advertisement