వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు

Published Sat, Oct 15 2016 1:15 AM

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు - Sakshi

- శాసనసభ హక్కుల కమిటీ నిర్ణయం
- హోదాకోసం నినదించిన 15మంది ఎమ్మెల్యేలు
- 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో హాజరు కావాలని ఆదేశం
 
 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నినదించిన 15 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరాలని ప్రివిలేజ్ (హక్కుల) కమిటీ నిర్ణయించింది. కమిటీ సమావేశం విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్‌సీపీ) కె. రామకృష్ణ, బీసీ జనార్దనరెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు.  తొలుత కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైనపుడు చర్చించిన అంశాలను ఆమోదించారు. సమావేశంలో గత నెల 8 నుంచి 10 వర కూ జరిగిన శాసనసభ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుమారు 15 మంది వైఎస్సార్‌సీీవ  ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని గుర్తించారు. వారిని కమిటీ ముందుకు పిలవాలని నిర్ణయించారు. 15 మందికి నోటీసులు జారీ చేసి ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే కమిటీ సమావేశానికి హాజరు కావాలని కోరనున్నారు.

 పామర్రు ఎంపీడీవోపై ఆగ్రహం
 కృష్ణా జిల్లా పామర్రు ఎంపీడీవో రామనాథంపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీకి లేఖ రూపంలో ఇచ్చిన వివరణలో పొందుపరిచిన అంశాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఇదే తీరుగా వ్యవహరిస్తే కమిటీ ముందు హైదరాబాద్‌లో హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్థానిక  ఎంపీడీవో రామనాథం ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, స్థానిక టీడీపీ నియోజకవర ఇన్‌చార్జి వర్ల రామయ్య ప్రోద్బలంతో అలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీన్ని కమిటీ విచారించి ఎంపీడీవో వివరణ కోరింది. ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా ఎంపీడీవో తన వివరణలో పేర్కొన్నారు. దీంతో క మిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి... ‘వివరణ మీపై అధికారి ద్వారా పంపించాలి. మీరు నేరుగా ఎలా పంపుతార’ని నిలదీసింది. కమిటీ ముందు వ్యవహరించే పద్ధతి ఇది కాదని, ప్రజాప్రతినిధి ఏ పార్టీకి చెందిన వారైనా గౌరవించాల్సిందేనని సూచించింది.

Advertisement
Advertisement