'ఎనిమిది భాషలు మాట్లాడగలను' | Sakshi
Sakshi News home page

'ఎనిమిది భాషలు మాట్లాడగలను'

Published Sun, Jul 19 2015 8:57 AM

'ఎనిమిది భాషలు మాట్లాడగలను' - Sakshi

ముషీరాబాద్: చిన్న వయస్సులోనే అనేక అంశాల్లో అసమాన ప్రతిభ చాటుతూ అందరి మన్ననలు పొందుతోంది.. ఎన్నారై శేషసాయి, శుభ దంపతుల కుమార్తె ఆశ్రిత. వివిధ కళల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోందీ పదిహేనేళ్ల అమ్మాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే.. పలు కమర్షియల్ వేదికలపై బాలీవుడ్ ప్రముఖులతో కలిసి స్టెప్పులేస్తోంది. తన ప్రతిభ, వాక్చాతుర్యంతో ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబును విస్మయానికి గురిచేసింది.

హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌కు చెందిన శేషషాయి 2005లో ఉద్యోగ రీత్యా కెనడాలోని వ్యాంకోవర్ వెళ్లారు. అక్కడ క్వాలిటీ కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. భార్య శుభ అక్కడే డెంటిస్ట్‌గా పని చేస్తోంది. ఐదేళ్ల వరకు ఇక్కడే ఉన్న ఆశ్రీత 2వ తరగతి వరకు చదివి... 2007లో తల్లిదండ్రుల చెంతకు వెళ్లింది. వేసవి సెలవులు కావడంతో రెండున్నర నెలల పాటు తాత, అమ్మమ్మల వద్ద గడిపేందుకు ఇండియాకు వచ్చింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించింది.    

సాక్షి: మీరు నేర్చుకున్న కళల గురించి చెబుతారా..?
ఆశ్రీత: భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినిఅట్టం, మోడ్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. 2011, 2013లో కెనడాలో జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిమ్స్ అవార్డ్స్ ఫంక్షన్‌లో ప్రదర్శనలిచ్చా. ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, షారుఖ్‌ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ తదితర బాలీవుడ్ నటులతో కలిసి స్టేజ్ షోలలో డ్యాన్స్ చేశా.  అమ్మ శుభ కూచిపూడి నృత్యకారిణి కావడం కలిసొచ్చింది.

సాక్షి: ఏఏ భాషలు మాట్లాడగలరు..?
ఆశ్రీత: మాతృభాష తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతి, ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ ఎనిమిది భాషలు మాట్లాడగలను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తాత నుంచి తెలుగు, అమ్మమ్మ ద్వారా కన్నడ, తమిళం వచ్చింది. కెనడాలోని స్నేహితుల వల్ల ఇంగ్లిష్, ఫ్రెంచ్ నేర్చుకున్నా. డ్యాన్స్ టీచర్ మలయాళీ కావడంతో ఆమె నుంచి మలయాళం తెలుసుకున్నా. కానీ తెలుగు మాట్లాడటమే ఇష్టం.

సాక్షి: మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి...
ఆశ్రీత: ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ సంస్థను ఏర్పాటు చేశా. సభ్యులతో తరచూ సమావేశమై సేవా కార్యక్రమాలు చేపడుతుంటా. ఇటీవల నిర్వహించిన నేషనల్ యోగా డేలో యూత్ కన్వీనర్‌గా పాల్గొన్నా. దీనికి గానూ ఇండో కెనడియన్ యూత్ అచీవర్ అవార్డు అందుకున్నా.
 
సాక్షి: అదనపు యాక్టివిటీస్ ఏవైనా చేస్తారా..?

ఆశ్రీత: స్విమ్మింగ్, ఐస్ స్కేటింగ్‌లో ప్రావీణ్యం ఉంది. పబ్లిక్ స్పీకింగ్ స్టేట్ లెవల్ ఇంటర్ స్కూల్ పోటీల్లో భాగంగా ‘ప్రపంచం - ఆకలి’ అంశంపై చేసిన ప్రసంగానికి మొదటి బహుమతి వచ్చింది. వ్యాంకోవర్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో యూఎన్‌ఓ వలంటీర్‌గా పని చేస్తా. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన డబ్బులను ఆఫ్రికన్ స్కూల్ పిల్లల కోసం వెచ్చించా. మిస్ టీనేజ్ సౌతర్న్ బీసీ -2014కి ఎంపికయ్యా. ప్రధాని మోదీతో కెనడాలో డిన్నర్ చేశా.  

సాక్షి: మీ జీవిత లక్ష్యం?
ఆశ్రీత: వ్యాంకోవర్‌లో డాక్టర్ విద్యను పూర్తి చేసుకుని చిన్న పిల్లల డాక్టర్ అయి భారత దేశానికి సేవ చేయాలనేదే...

Advertisement
Advertisement