నిధుల కోసమే నుమాయిష్‌ | Sakshi
Sakshi News home page

నిధుల కోసమే నుమాయిష్‌

Published Mon, Jan 1 2018 2:44 AM

Numaish only for funds - Sakshi

నుమాయిష్‌.. దాదాపు 2,500 స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 40 లక్షల మంది సందర్శకులతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరుపొందిన ఈవెంట్‌. నగరంలో ప్రతి యేటా జనవరి 1వ తేదీన ప్రారంభమై.. 45 రోజుల పాటు కొనసాగుతుంది. నిజాం సంస్థానంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిర్వహించే సర్వే కోసం సుమారు 80 స్టాల్స్‌తో రూ. 2.5 లక్షల ఖర్చుతో ఈ నుమాయిష్‌ ప్రారంభమైంది. నేడు నుమాయిష్‌ ప్రారంభమౌతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం...        
– సాక్షి, హైదరాబాద్‌

నూమాయిష్‌ ఎక్కడ ప్రారంభించారు..
అనుమతి లభించిన వెంటనే పట్టభద్రుల సంఘం.. వివిధ పనులపై కమిటీలు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, పెద్ద దుకాణాల నిర్వాహకులను సంప్రదించి నుమాయిష్‌ ఆవశ్యకత ను వివరించారు. ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వెతికారు. చివరికి బాగే ఆమ్‌ (పబ్లిక్‌గార్డెన్‌)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాక 1938, ఏప్రిల్‌ 6న ఉస్మాన్‌ అలీఖాన్‌ జన్మదినం సందర్భంగా ఆయన చేతుల మీదుగానే పబ్లిక్‌ గార్డెన్‌లో (నముష్‌–ఇ–మాస్నావత్‌–ఎ–ముల్కి)గా నుమాయిష్‌ను ప్రారంభించారు. తొలి ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్‌ నిర్వహించారు.

పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి నాంపల్లికి... 
అప్పటి స్టాల్స్‌ 
 1946 వరకు పబ్లిక్‌ గార్డెన్స్‌లో నుమాయిష్‌ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. ప్రజా దరణ పెరిగి స్టాల్స్‌ పెరగడంతో పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థలం సమస్య వచ్చింది. దీంతో నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానానికి మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రదేశం నాంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకూ అనువుగా ఉంటుందని భావించారు. అలా 1946లో హైదరాబాద్‌ ప్రధాని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ ఆదేశాల మేరకు సుమాయి ష్‌ను పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి నాంపల్లి మైదానాని(ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌)కి మార్చారు. 




ఆలిండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌... 
1949లో నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలచారి 
1947లో దేశ స్వాతంత్య్రం.. 1948లో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనంతో ఈ రెండేళ్లు నుమాయిష్‌ ఏర్పాటు చేయలేదు. తిరిగి 1949లో నాంపల్లి మైదానంలోనే నాటి హైదరాబాద్‌ రాష్ట్ర గవర్నర్‌ జనరల్‌ సి. రాజగోపాల్‌ ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్‌ పేరును ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ ప్రతి ఏటా ఎలాంటి అంతరాయం లేకుండా ఎగ్జిబిషన్‌ సాగుతోంది. ప్రపంచంలో ఎలాంటి విరామం లేకుండా 45 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఈవెంట్‌ హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌. గతేడాది 40 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. వాణిజ్యంలో రూ. 150 కోట్లు దాటింది. ఇందులో రూ. 10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు ఉంటాయి. 

నుమాయిష్‌ ఐడియా ఎలా వచ్చింది... 
హైదరాబాద్‌ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని 1937లో నాటి ఉస్మానియా పట్టభద్రుల సంఘ సమావేశం తీర్మానించింది. అయితే సర్వే నిర్వహించడానికి నిధుల కొరత ఉండటంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరించాలని సభ్యులు సలహా ఇచ్చారు. సంస్థానంలో తయారయ్యే వివిధ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేస్తే పరిశ్రమల ద్వారానే కాకుండా సందర్శకుల నుంచి కూడా నిధులు వస్తాయని ఆలోచించి నుమాయిష్‌ (ప్రదర్శన)కు రూపకల్పన చేశారు.

అనుమతి లభించిందిలా... 
1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్‌ ఏర్పాటుకు ఓ నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్‌ అక్బర్‌ హైదరీకి పంపించారు. ఆయన పూర్తిస్థాయిలో నివేదిక పరిశీలించి ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు పంపించారు. నివేదిక అందిన తరువాత ఉస్మాన్‌ అలీ ఖాన్‌ నుమాయిష్‌ నిర్వహణకు అనుమతి ఇచ్చారు.

Advertisement
Advertisement