సీఎం సమీక్షా... అయితే పస్తే! | Sakshi
Sakshi News home page

సీఎం సమీక్షా... అయితే పస్తే!

Published Fri, Feb 5 2016 9:21 AM

సీఎం సమీక్షా... అయితే పస్తే! - Sakshi

సాక్షి, హైదరాబాద్: శాఖలు, పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు అధికారులకు ప్రాణసంకటంగా తయారయ్యాయి. రహదారులు-భవనాల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విజయవాడలో సమీక్ష ఏర్పాటు చేశారు. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కంపెనీల సీఈఓలు సీఎం సమీక్ష కోసం సాయంత్రం 4 గంటల నుంచే వేచి ఉన్నారు.

అయితే మంత్రివర్గ సమావేశం, ఆ తరువాత విలేకరుల సమావేశం ముగించుకుని చంద్రబాబు నాయుడు రాత్రి 9.30 గంటలకు రహదారుల సమీక్షకు హాజరయ్యారు. రాత్రి 12.45 గంటల వరకు సమీక్ష కొనసాగించారు. అధికారులు, ఇంజనీర్లు, సమీక్షకు వచ్చిన ఇతరులు భోజనాలు చేశారా లేదా అనే విషయాన్ని ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి వారికి భోజనం దొరుకుతుందా లేదా అనే ఆలోచన కూడా చేయలేదు. దీంతో ముగ్గురు అధికారులకు షుగర్ లెవల్స్ పడిపోయాయి.

ఇందులో ఒక సీనియర్ అధికారి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ముఖ్యమంత్రి పేషీకి చెందిన లేడీ డాక్టర్‌ను పిలిపించి ఇంజక్షన్ ఇప్పించాలని ప్రయత్నించారు. అయితే ఏమీ తిననందున ఇప్పటికిప్పుడు ఇంజక్షన్ ఇవ్వలేనని, అలా చేస్తే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఆ డాక్టర్ పేర్కొన్నారు. దీంతో స్వీట్ తిన్న తరువాత ఇంజక్షన్ ఇచ్చారు. రాత్రి 12.45 గంటలకు సమీక్ష ముగిసిన తరువాత అధికారులు, ఇంజనీర్లు భోజనం చేసేందుకు రోడ్లపైకి వస్తే హోటల్స్ మూసేసి ఉన్నాయి. దీంతో రోడ్డు పక్కన బండ్లపై ఇడ్లీలను తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రికి  నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి హైదరాబాద్ నుంచి అఖిల భారత సర్వీసు అధికారులు విజయవాడకు తరలివెళ్లారు.

ఆ రోజు రాత్రి  9 గంటలకు ముఖ్యమంత్రి అఖిల భారత అధికారులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసగించారు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం డిన్నర్ ఏర్పాటు చేస్తారనే భావనలో  అధికారులున్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రసంగం ముగించిన తరువాత భోజనం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. దీంతో ఆ రోజు కూడా రాత్రి భోజనం కోసం అధికారులు రహదారుల బాట పట్టిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement