బీఎడ్‌ ప్రవేశాలు అనుమానమే! | Sakshi
Sakshi News home page

బీఎడ్‌ ప్రవేశాలు అనుమానమే!

Published Sat, Jan 21 2017 3:42 AM

బీఎడ్‌ ప్రవేశాలు అనుమానమే!

  • 2016 రెండో దశ బీఎడ్‌ కౌన్సెలింగ్‌కు ససేమిరా అంటున్న అధికారులు
  • 2017లోనూ ఎడ్‌సెట్‌ కష్టమంటున్న ఉన్నత విద్యాశాఖ వర్గాలు
  • ఎడ్‌సెట్‌ తేదీ ఖరారు చేసినా, కన్వీనర్‌ను ఎంపిక చేయని ఉన్నత విద్యామండలి
  • సాక్షి, హైదరాబాద్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌)లో ప్రవేశాల కోసం ప్రస్తుత (2016–17) విద్యా సంవత్సరంలో రెండో దశ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ససేమిరా అంటున్న నేపథ్యంలో 2017–18లో బీఎడ్‌ ప్రవేశాల విషయంలో అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసినా, విద్యాపరంగా నాణ్యత ఉండటం లేదని, ప్రైవేటు బీఎడ్‌ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా తయారయ్యాయనే ఆరోపణలతో వచ్చే విద్యా సంవత్సరంలో బీఎడ్‌లో ప్రవేశాలను ప్రభుత్వం చేపడుతుందా, లేదా, అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

    స్వయంగా అసెంబ్లీలోనే బీఎడ్‌ కాలేజీల తీరుపై సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో 2017–18లో బీఎడ్‌ ప్రవేశాలపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. వచ్చే మే 28వ తేదీన బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌–2017ను నిర్వహిస్తామని ప్రకటించింది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుందని పేర్కొంది. కానీ కన్వీనర్‌ ఎంపిక విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. ప్రభుత్వం నుంచి ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో ప్రకటన చేయలేదు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను ప్రకటించిన మండలి ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ను ప్రకటించలేదు. రాష్ట్రం లో బీఎడ్‌ కాలేజీల్లోని 13 వేల సీట్లలో ప్రస్తుతం రెండో దశ కౌన్సెలింగ్‌ లేకపోవడం వల్లే 8 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి.

Advertisement
Advertisement