ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక

Published Fri, Jan 22 2016 2:59 AM

ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. 5న కౌంటింగ్ పూర్తవనుండగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి విజయం సాధించిన కార్పొరేటర్లకు 6న ప్రత్యేక నోటీస్ జారీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. మేయర్ ఎన్నికల్లో 150 డివిజన్ల కార్పొరేటర్లతో పాటు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్న వారు ఓటర్లుగా ఉంటారు. ఈ ఎన్నికకు రంగారెడ్డి లేదా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సెంటర్‌లో ఎన్నికల సమాచారాన్ని చార్టుల రూపంలో ప్రదర్శించడంతోపాటు ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు మూడు టెలిఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.
 
ఫోన్ నెంబర్లు: 040- 2326 1330, 2322 2018, 2322 1978.
 
అదనంగా 35 పోలింగ్ కేంద్రాలు
ఇప్పటికే ఉన్న 7757 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 35 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు పెరిగినందునఅదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాలు 7792 కానున్నాయి. ఎన్నికల  విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈనెల 27లోగా పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వీటిని ఫిబ్రవరి 4లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపించాల్సి ఉంటుందన్నారు.

ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొనేలా విద్యార్థుల ద్వారా సంకల్ప పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8.92 లక్షల ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశామన్నారు. వీటితోపాటు ఎన్నికల సంఘం వెబ్‌సైట్, ప్రత్యేక యాప్‌ల ద్వారా 3.83 లక్షల మంది ఓటర్ స్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు.

Advertisement
Advertisement