వాంటెడ్ డాక్టర్స్ | Sakshi
Sakshi News home page

వాంటెడ్ డాక్టర్స్

Published Wed, Jul 26 2017 3:09 AM

వాంటెడ్ డాక్టర్స్ - Sakshi

ప్రతి ఏటా విరమణలే.. కొత్త వైద్యులు లేనే లేరు
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందులు
వయసు పెంపుపై పట్టని ప్రభుత్వం.. వైద్య సేవలపై ప్రభావం
 
సాక్షి, హైదరాబాద్‌: ఓ వైపు 58 ఏళ్లకే పదవీ విరమణ.. మరోవైపు కొత్తగా నియామకాలు లేకపోవడం.. వైద్యులు లేక ప్రభుత్వ ఆసుపత్రులు కొట్టుమిట్టాడుతున్నాయి. అలాగే సీనియర్‌ వైద్య అధ్యాపకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చే వైద్యుల వయస్సు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అస్పష్ట వైఖరిపై వైద్య వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. చాలా రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంచాలనే డిమాండ్‌ ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా ప్రభుత్వ వైద్యుల నియామకం జరగలేదు.

ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపక పోస్టులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వందల ఖాళీలు ఉన్నాయి. దీంతో ప్రజారోగ్య సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అనుభవజ్ఞులైన వైద్యుల సేవలను కొనసాగిస్తే... వైద్య విద్య బోధనలో, వైద్య సేవల విషయంలో మెరుగైన ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంచకపోవడంతో... పదవీ విరమణ చేసిన వారిలో ఎక్కువ మంది ప్రైవేటు రంగంలో సేవలు కొనసాగిస్తున్నారు.
 
ఎక్కువ రాష్ట్రాల్లో...
వైద్య వృత్తి అనేది మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా ఉంటుంది. సీనియర్‌ వైద్యులకు పరిజ్ఞానం అధికం. వైద్య చికిత్సలో, వైద్య విద్య బోధనలో అనుభవం వారిని మార్గదర్శకులుగా తయారుచేస్తుంది. ఇలాంటి కారణాలతో వైద్యుల పదవీ విరమణ వయస్సు విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో... ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 70 ఏళ్ల వరకు పెంచాలని నిర్ణయించింది. వైద్య విద్యపై వివిధ అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల రూపొందించిన ప్రతిపాదనలలో ఈ నిర్ణయాన్ని పేర్కొంది.

పదవీ విరమణ పెంపుపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రాలను కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, వైద్య కాలేజీల్లో అధ్యాపకుల విరమణ వయస్సు 58 ఏళ్లు ఉంది. ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60 ఏళ్లు... గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌లలో 62 ఏళ్లు... హరియాణా, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 65 ఏళ్లు... బిహార్‌లో 67 ఏళ్లు ఉంది. తెలంగాణలో ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్‌)లో 60 ఏళ్లు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్‌ వంటి వైద్య బోధన సంస్థల్లో వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 65 ఏళ్లు ఉంది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో విరమణ వయస్సు 70 ఏళ్లు ఉంది. అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంచాలని అన్ని వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
 
రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ వైద్యుల సంఖ్య..3,721
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. 320
ప్రతి ఏటా పదవీ విరమణ చేస్తున్న వైద్యుల సంఖ్య.. 50 పైనే

పలు రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు ఇలా.. 


Advertisement
Advertisement