రోజులో ఎన్నిసార్లు చిక్కితే అన్ని చలాన్లు! | Sakshi
Sakshi News home page

రోజులో ఎన్నిసార్లు చిక్కితే అన్ని చలాన్లు!

Published Thu, Jul 6 2017 8:47 AM

రోజులో ఎన్నిసార్లు చిక్కితే అన్ని చలాన్లు!

వాహన అద్దాల ‘రంగు’ వదలాల్సిందే!
వాటి లోపలి భాగం స్పష్టంగా కనిపించాల్సిందే
సోమవారం నుంచి ఉల్లంఘనులకు రూ.500 వడ్డన
మరోసారి ‘ఆపరేషన్‌ బ్లాక్‌ఫిల్మ్‌’  :జేసీపీ రవీందర్‌


సాక్షి, సిటీబ్యూరో: ‘కార్లు తదితర వాహనాల అద్దాలపై ఉంటున్న రంగు ఫిల్మ్‌లు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించండి. వాటి లోపలి భాగాలు స్పష్టంగా బయటకు కనిపించేలా చర్యలు తీసుకోండి’ అంటూ 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు మరోసారి అమలులోకి తీసుకురానున్నారు. ఆ ఏడాది తొలిదశ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన అధికారులు వాహనచోదకుల్లో అవగాహన తీసుకువచ్చారు. ఫలితంగా సిటీలో దాదాపు 95 శాతం వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్‌ఫిల్మ్‌ తొలగింది. అయితే ఇంకా మిగిలిన వాహనాలు ఇప్పటికీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) డాక్టర్‌ వి.రవీందర్‌ బుధవారం వెల్లడించారు.

వీరిపై సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం, ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో ఉండని అర్ధరాత్రి వేళ వాహనాలతో బయటకు రావడం చేస్తున్నట్లు పరిగణిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు సైతం బ్లాక్‌ఫిల్మ్‌తో కూడి ఉంటున్నట్లు అధ్యయనంలో తేల్చామని రవీందర్‌ తెలిపారు. వివిధ సందర్భాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఈ తరహా ఉల్లంఘనలపై 44,079 కేసులు నమోదు చేశారన్నారు. సోమవారం నుంచి చేపట్టబోయే స్పెషల్‌ డ్రైవ్‌లో చిక్కిన వాహనాలకు రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. సాధారణంగా ట్రాఫిక్‌ పోలీసులు ఓ ఉల్లంఘనపై జరిమానా విధిస్తే... మళ్ళీ 24 గంటలు దాటే వరకు అదే ఉల్లంఘనపై, అదే వాహనానికి మరోసారి జరిమానా విధించే ఆస్కారం ఉండదు. అయితే బ్లాక్‌ఫిల్మ్‌ కేసుల్లో ఒక రోజులో ఎన్ని చోట్ల వాహనం చిక్కితే అన్ని చలాన్లు జారీ చేస్తామని రవీందర్‌ స్పష్టం చేశారు.

లైసెన్స్‌ లేని చోదకులకు జైలు...
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ... ట్రాఫిక్‌ పోలీసులకు నాలుగో సారి చిక్కిన వాహన చోదకులకు సికింద్రాబాద్‌ న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించిందని జేసీపీ రవీందర్‌ బుధవారం తెలిపారు. దీంతో పాటు వీరికి రూ.వెయ్యి జరిమానా సైతం పడిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధం, ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు లైసెన్స్‌ లేని వాహనచోదకులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టే స్పెషల్‌డ్రైవ్స్‌లో చిక్కిన ఉల్లంఘనుల నుంచి వెహికిల్‌ స్వాధీనం చేసుకుంటామని, జరిమానా చెల్లించడంతో పాటు ఆర్టీఏ అధికారుల నుంచి లైసెన్స్‌/లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందిన తర్వాతే వాహనాన్ని విడిచిపెడతామని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి న్యాయస్థానాల్లో చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement