అరబ్‌షేక్‌ల షాదీలను అడ్డుకునే ఆర్డినెన్స్‌ | Sakshi
Sakshi News home page

అరబ్‌షేక్‌ల షాదీలను అడ్డుకునే ఆర్డినెన్స్‌

Published Thu, Sep 7 2017 3:02 AM

Ordinance to stop the Arab Sheikh Shadis

ముసాయిదా సిద్ధం చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌కు వచ్చిన అరబ్‌షేక్‌లు ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకొని, అనంతరం గల్ఫ్‌కు తీసుకెళ్లే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు లేనందున ముందుగా ఆర్డినెన్స్‌ జారీచేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన పలు సంఘటనల నేపథ్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆర్డినెన్స్‌కు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది.

వైద్య చికిత్స, టూరిస్టుల పేరుతో గల్ఫ్‌ నుంచి వచ్చే అరబ్‌ షేక్‌లు 18 ఏళ్లలోపు అమ్మాయిలను పెళ్లిచేసుకొని మోసం చేయటం, కొందరిని గల్ఫ్‌కు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా పలు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పెళ్లి చేసుకునేందుకు వచ్చే అరబ్‌షేక్‌లు అదే కారణాన్ని గల్ఫ్‌ ఎంబసీలోనే నమోదు చేయాలని, పెళ్లికి సంబంధించిన పత్రాలను విదేశాంగశాఖకు అందించటంతో పాటు, పోలీసులకు సైతం తగిన ధ్రువపత్రాలను సమర్పించేలా పలు కఠినమైన నిబంధనలను ఈ ముసాయిదాలో పొందుపరిచింది.

దీనికి సంబంధించిన న్యాయపరమైన సలహాలు సూచనలకు మైనారిటీ విభాగం ఇటీవలే ముసాయిదాను న్యాయశాఖకు పంపించింది. కానీ న్యాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ ముసాయిదా తిరుగుటపా పట్టింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనలపై మహిళా కమిషన్, జాతీయ మానవహక్కుల సంఘంతో  పాటు ముస్లిం పర్సనల్‌ లా బోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ ఆర్డినెన్స్‌పై ముందుకు వెళ్లలా.. వద్దా.. అని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement