నూరేళ్ల ఉత్సవాలు చూద్దాం రారండి.. | Sakshi
Sakshi News home page

నూరేళ్ల ఉత్సవాలు చూద్దాం రారండి..

Published Tue, Apr 25 2017 11:56 PM

నూరేళ్ల ఉత్సవాలు చూద్దాం రారండి..

ఉస్మానియా యూనివర్సిటీ: నిజాం నవబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతగా నూరు వసంతాలు పూర్తి చేసుకుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రారంభ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సుందరంగా అలంకరించిన క్యాంపస్‌ను నేటి తరం విద్యార్థులు చూడాల్సిందే. క్యాంపస్‌లోని కళాశాలలు, కార్యాలయాలు, హాస్టల్స్‌ విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోతున్నాయి. క్యాంపస్‌ ఎన్‌సీసీ గేటు నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు ప్రతి చెట్టూ కాంతులీనుతున్నాయి.

అత్యాధునిక మ్యూజియం సిద్ధం
క్యాంపస్‌ సైన్స్‌ కళాశాలలోని జంతుశాస్త్రం విభాగంలో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మృతిచెందిన జంతువుల మ్యూజియాన్ని రేపటి నుంచి తెరవనున్నారు. జియాలజీ విభాగంలో వివిధ రకాల గ్రానైట్‌ రాళ్లు, ఇంజినీరింగ్‌ కళాశాలలోని వర్క్‌షాప్‌లు, యూనివర్సిటీ లైబ్రరీ, ఆర్ట్స్‌ కళాశాల భవన నిర్మాణ శైలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జూవాలజీ, బోటాని, ఫోరెన్సిక్‌ సైన్స్, బయో కెమిస్ట్రీ తదితర విభాగాలను, పరిశోధన ల్యాబులనూ చూడవచ్చు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా  క్యాంపస్‌లోని ఆర్ట్స్‌ కళాశాల ఎదుట భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆహ్వాన కార్డులు, పాసుల కొరత
ఓయూ శతాబ్ది ఉత్సవాల సభలోకి ప్రవేశించేందుకు ఆహ్వానకార్డులు, పాసుల కొరత ఏర్పడింది. సభను కేవలం 15 వేల మంది కోసం నిర్మించారు. అయితే ఉత్సవాలను వేల సంఖ్యలో చూసేందుకు విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు పోటీపడుతున్నారు. వివిధ దేశాలలో స్థిరపడిన వందలాది ఓయూ పూర్వవిద్యార్థులు విచ్చేశారు.

Advertisement
Advertisement