2019లో మనదే అధికారం: ఉత్తమ్ | Sakshi
Sakshi News home page

2019లో మనదే అధికారం: ఉత్తమ్

Published Sun, Jun 19 2016 4:05 AM

2019లో మనదే అధికారం: ఉత్తమ్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: కొందరు నాయకులు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీలేదని, 2019లో కాంగ్రెస్‌పార్టీదే అధికారమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మారిన నేతలతో కాంగ్రెస్‌పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

భవిష్యత్తులో తీసుకోబోయే ఏ నిర్ణయంలోనైనా స్థానిక నాయకుల అభిప్రాయాలకు పూర్తి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. త్వరలో రామగుండంలో భారీ సభను నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలు నిరాశ చెందవద్దన్నారు.
 పర్యావరణ విధ్వంసమేనా అభివృద్ధి?: ఉత్తమ్ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ అభివృద్ధి అంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో చెట్లు నరికేస్తూ జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ వల్ల జరిగే నష్టం, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై గాంధీభవన్‌లో శనివారం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కేబీఆర్ పార్కును ధ్వంసం చేసే కుట్రకు టీఆర్‌ఎస్ పాల్పడుతోందని, కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పర్యావరణ వేత్తలు పురుషోత్తమ్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు.

Advertisement
Advertisement