నేటితో పాలేరు ప్రచారం సమాప్తం | Sakshi
Sakshi News home page

నేటితో పాలేరు ప్రచారం సమాప్తం

Published Sat, May 14 2016 2:46 AM

Paleru campaign to be ended today

టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల సహా పది మంది అమాత్యుల ప్రచారం
 
 సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప పోరు చివరి అంకానికి చేరింది. ఈ నెల 16న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం శనివారంతో ముగియనుంది. ఈ స్థానంలో కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో అధికార టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావునే అభ్యర్థిగా బరిలోకి దింపడం నుంచి సగానికిపైగా కేబినెట్‌ను ప్రచారంలో నిమగ్నం చేయడం దాకా టీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంకన్నా టీఆర్‌ఎస్‌కే అతితక్కువ ఓట్లు వచ్చాయి.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పాలేరుపై టీఆర్‌ఎస్ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఖమ్మంలో పార్టీ 15వ ప్లీనరీని, భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక విధంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించడమే కాకుండా మొత్తం నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి కె.తారక రామారావును నియమించారు. అభ్యర్థి తుమ్మల సహా పది మంది మంత్రులు పాలేరులో ప్రచారం చేస్తున్నారంటే టీఆర్‌ఎస్ నాయకత్వం ఈ ఎన్నికను ఎంత సవాలుగా తీసుకుందో అర్థమవుతోంది.

శనివారంతో ప్రచారం ముగుస్తుండటంతో ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల్లో సగం మందిని పార్టీ నాయకత్వం శుక్రవారం వెనక్కి పిలిపించింది. ఇన్‌చార్జి మంత్రులతోపాటు మంత్రి కేటీఆర్ శనివారం మధ్యాహ్నం తర్వాత తిరుగు ముఖం పట్టనున్నారు. మరోవైపు పాలేరు నుంచి రెండుసార్లు వరుసగా గెలిచిన కాంగ్రెస్...ఉప ఎన్నికలో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తిగా పాలేరులోనే మకాం వేసి ప్రచారం చేస్తోంది. టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా వారికి అండగా నిలుస్తోంది. కాగా, సీపీఎం అభ్యర్థి కోసం మరో వామపక్ష పార్టీ సీపీఐ మద్దతివ్వగా ఇతర వామపక్షాలూ తమ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. 19న జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Advertisement
Advertisement