బడుల బాధ్యత పంచాయతీలదే! | Sakshi
Sakshi News home page

బడుల బాధ్యత పంచాయతీలదే!

Published Wed, Feb 24 2016 3:03 AM

బడుల బాధ్యత పంచాయతీలదే! - Sakshi

♦ విద్యా వ్యవస్థ బలోపేతానికి కొత్త చట్టం: సీఎం కేసీఆర్
♦ అన్ని రకాల విద్యను విద్యాశాఖ పరిధిలోకి తేవాలి
♦ విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘చాలా పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. మంచి నీళ్లుండవు. పరిశుభ్రత ఉండదు. మరుగుదొడ్లు శుభ్రం చేయరు. ఈ విషయాల్లో గ్రామ పంచాయతీలను బాధ్యులను చేస్తూ చట్టం చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేదవర్గాల పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఏటా రూ. 20 వేల కోట్లకుపైగా విద్య కోసం ఖర్చు పెడుతున్నా... అనుకున్న ఫలితాలు రావడం లేదన్నారు. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం విద్యాశాఖతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, వివిధ శాఖల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని వాటికి అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. వచ్చే ఏడాదికి మాత్రం ప్రస్తుత విద్యావ్యవస్థను కొనసాగించాలని సూచించారు.

 లక్ష్యం చేరేలా ఖర్చు జరగాలి
 పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా విద్యా విధానం ఉండాలని, అదే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం సూచించారు. ప్రణాళికేతర వ్యయంలో దుబారా తగ్గించి, అవసరమైన చోట నిధులను ఖర్చు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న హాస్టళ్లను దశల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని, ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందిం చాలని ఆదేశించారు. ‘‘ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందో విద్యాశాఖకు స్పష్టత ఉండాలి. అలాగైతేనే ఎంత సమర్థంగా విద్యను పేదలకు అందించాలనే అంచనా దొరుకుతుంది. విద్యార్థులు లేకుండా ఉన్న పాఠశాలలను ఏం చేయాలో ఆలోచించాలి. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ఓ విధానం రూపొందించాలి..’’ అని సీఎం సూచించారు.
 
 విభాగాలు తగ్గించండి
 విద్యాశాఖలో 14 విభాగాలున్నాయని, అన్ని అవసరం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవసరం లేని విభాగాలను తొలగించాలని, ఒకే స్వభావం ఉన్నవాటిని విలీనం చేయాలని అధికారులకు సూచించారు. ఆర్కైవ్స్, గ్రంథాలయాల లాంటి విభాగాలను కల్చరల్ శాఖకు అప్పగించాలని చెప్పారు. అన్ని రకాల విద్యను విద్యాశాఖ పరిధిలోకే తేవాలని పేర్కొన్నారు. ‘‘ప్రతీ విభాగం గురించి అధ్యయనం చేయండి. ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన ప్రతీ పథకాన్ని, ప్రతీ అంశాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం లేదు. స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్య, వివిధ సొసైటీల ద్వారా నడుస్తున్న విద్యాసంస్థల సమగ్ర సమాచారం ఒకే దగ్గర ఉండాలి. విద్యావ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నం
 జరగాలి ..’’ అని సీఎం సూచించారు. కేంద్ర ఆర్థిక సాయంతో నడిచే పథకాల్లో మార్పులతో రాష్ట్ర ఖర్చు పెరుగుతుందని, అందువల్ల కేంద్ర పథకాల అమలుపై సమీక్షించుకోవాలని చెప్పారు. అదే తీరుగా బడ్జెట్ ప్రతిపాదనలుండాలని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement