కట్టలు తెగిన ఆగ్రహం | Sakshi
Sakshi News home page

కట్టలు తెగిన ఆగ్రహం

Published Wed, May 20 2015 12:23 AM

కట్టలు తెగిన ఆగ్రహం

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
డీఈఓ కార్యాలయం ముట్టడి
పిల్లలను పరీక్షల్లో పాస్ చేయాలని డిమాండ్
 

సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: హైదరాబాద్ డీఈఓ కార్యాలయ పరిసరాలు మంగళవారం రణరంగాన్ని త లపించాయి. తమకు న్యాయం కావాలని వస్తే.. అధికారుల స్పందన సరిగా లేదని కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు కార్యాలయంపై దాడి చేశారు. తలుపులు, కిటికీల అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. పదో తరగతిలో తమ పిల్లలు తప్పడానికిఅధికారులే కారణమని ఆరోపించారు. తప్పులను సరిదిద్ది ఉత్తీర్ణులను చే యాలని డిమాండ్ చేస్తూ... గన్‌ఫౌండ్రీలోని డీఈఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలసి తల్లిదండ్రులు ముట్టడించారు. తమకు న్యాయం కావాలని కోరుతూ తొలుత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి వెళ్లారు. విద్యార్థులను పాస్ చేయించడం తమ పరిధిలో లేదని... డీఈఓ కార్యాలయానికి వె ళ్లాలని అక్కడి ఉద్యోగులు వీరికి సూచించారు. దీంతో డీఈఓ కార్యాలయానికి చేరుకొని...దాదాపు గంట పాటు అక్కడే బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటకు పంపించారు.

కొద్దిసేపటి తర్వాత మళ్లీ వారంతా డీఈఓ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు, వారికి తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు డీఈఓ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లి పూల కుండీలు కిందపడేశారు. రాళ్లతో తలుపుల అద్దాలు పగులగొట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.  దాడికి దిగారన్న అనుమానంతో ఇద్దరు విద్యార్థులను, తల్లిదండ్రులను పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ రాఘవేందర్ రెడ్డి డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. సంఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా... ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతుండగా... తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని డీఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఈఓ అన్నారు. రీవాల్యూయేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
 
మూల్యాంకన లోపాలే శాపం

దోమలగూడ: గణితం జవాబు పత్రాల మూల్యాంకన సూత్రాల్లోని లోపాలే పదో తరగతిలో ఆ సబ్జెక్టులో ఎక్కువ మంది విద్యార్థులు తప్పడానికి కారణమని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి అభిప్రాయపడ్డారు. దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. సహజంగా చాయిస్ ఉన్న ప్రశ్నల్లో రాయాల్సిన  కంటే  ఎక్కువ వాటికి సమాధానాలు రాసినపుడు అత్యధిక మార్కులు పొందిన సమాధానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గణితంలో తొలుత రాసిన సమాధానాలను మాత్రమే (తక్కువ మార్కులు వచ్చినా) తీసుకొని మిగిలిన వాటిని దిద్దకుండా వదిలేయాలని మూల్యాంకన సూత్రాల్లో పేర్కొన్నారని వివరించారు. తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో మాత్రం అన్ని సమాధానాలను దిద్ది... అత్యధిక మార్కులు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంగా చెప్పారన్నారు. ఇతర సబ్జెక్టుల్లో ఈ అంశాన్నే ప్రస్తావించలేదని తెలిపారు. ఈ కారణంగానే గణితంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయినట్లు అర్థమవుతోందన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
పరీక్ష తప్పే అవకాశం లేదు...

మా అమ్మాయి జ్యోతి వైష్ణవ్ పరీక్ష బాగా రాసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిలయ్యే అవకాశమే లేదు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సంపాదించినా.. గణితంలో ఫెయిల్ చేశారు. న్యాయం కావాలని డీఈఓ ఆఫీస్‌కు వెళితే.. అక్కడదాడి జరగడంతో మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేసింది ఇతరులైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు.     - అనిత, మంగళ్‌హాట్
 
బాగా రాసినా...

సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల్లో నాకు ఎ, బి గ్రేడ్లు వచ్చాయి. మిగతా వాటిలాగే సైన్స్ పరీక్ష బాగా రాశా. తీరా ఫలితాలు చూస్తే ఫెయిల్. అధికారులు సరిగా దిద్దకపోవడమే కారణం. డీఈఓ ఆఫీస్ దగ్గర గొడవైతే అన్యాయంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
 - ఎండీ ఇక్బాల్, ఏసీ గార్డ్స్, లక్డీకపూల్
 
 
 

Advertisement
Advertisement