‘కొత్త’ కమిటీలపై పార్టీల కసరత్తు | Sakshi
Sakshi News home page

‘కొత్త’ కమిటీలపై పార్టీల కసరత్తు

Published Sun, Oct 9 2016 3:27 AM

‘కొత్త’ కమిటీలపై పార్టీల కసరత్తు - Sakshi

జిల్లాల స్వరూపం మార్పుతో రద్దు కానున్న ప్రస్తుత కమిటీలు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తదనుగుణంగా కొత్త జిల్లాల్లో కమిటీల ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. మొత్తంగా 31 జిల్లాలు ఏర్పడవచ్చన్న ప్రభుత్వ సంకేతాలతో పార్టీ వ్యవస్థలను మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పాత జిల్లాల స్వరూపం, పరిధి మారనున్నందున ప్రస్తుతమున్న అన్ని పార్టీల జిల్లా కమిటీలు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎంలు కొత్త జిల్లాల్లో పార్టీ కార్యదర్శులను, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు జిల్లాల పార్టీ అధ్యక్షులను కొత్తగా నియమించుకోవాల్సి ఉంది. దీనిపై ఆయా పార్టీల నేతలు ఏమన్నారంటే...

నెలాఖరుకల్లా కమిటీలు
కొత్త జిల్లాల ఏర్పాటునకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా కొత్త జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలను నియమించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రస్తుతం ఎంపిక కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాలు, వాటి భౌగోళిక స్వరూపం తదితరాలను పరిశీలించి కమిటీల నియామకం పూర్తి చేస్తాం. - ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు

నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో...
ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో కొత్త జిల్లాల కమిటీలు వేస్తాం. కొత్త జిల్లాల ప్రకటన వెలువడ్డాక ఈ నెల 15, 16, 17 తేదీల్లో పాత జిల్లాల కార్యవర్గ సమావేశాలల్లో ఆయా అంశాలపై చర్చిస్తాం. జిల్లాల నైసర్గిక స్వరూపం, పరిధిని బట్టి కొత్త కమిటీలను ఏర్పాటుచేస్తాం. కొత్త వారికి అవకాశమిస్తాం.                                             
 - కె.లక్ష్మణ్,  బీజేపీ అధ్యక్షుడు

వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగా జిల్లాల కమిటీల్లో మార్పులు చేస్తాం. కొత్త జిల్లాలనుబట్టి నూతన జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం. పార్టీ అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులతోపాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కమిటీల్లో మార్పులు చేస్తాం.
 - గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు

నవంబర్ 22కల్లా సిద్ధం
వచ్చే నెల 22 నాటికి కొత్త జిల్లాలన్నింటికీ కొత్త కమిటీలు వేస్తాం. అప్పటివరకు ప్రస్తుత జిల్లాల కమిటీల కార్యదర్శులే వారి పరిధిలో ఏర్పడే జిల్లాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు. పార్టీ జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం గ్రామ, మండల, జిల్లా, రాష్ర్టస్థాయి నిర్మాణ మహాసభలు నిర్వహిస్తున్నాం.  
- చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి

అధికారికంగా వెల్లడయ్యాకే...
కొత్త జిల్లాల ఏర్పాటును అధికారికంగా ప్రకటించాక వాటి పరిధి ఇతర అంశాలపై చర్చించి కొత్త కమిటీలపై నిర్ణయిస్తాం. ప్రభుత్వం మొదట పేర్కొన్నట్లుగా 27 జిల్లాలకు కమిటీలను ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ జిల్లాల సంఖ్యలో మార్పుచేర్పుల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నాం. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం కార్యదర్శి

Advertisement
Advertisement