అపూర్వ ఘట్టం | Sakshi
Sakshi News home page

అపూర్వ ఘట్టం

Published Mon, Aug 10 2015 11:55 PM

అపూర్వ ఘట్టం

ప్రశాంతంగా ఘటాల ఊరేగింపు పోటెత్తిన భక్తులు
 

చార్మినార్ : బోనాల జాతర సందర్భంగా పాతబస్తీలో సోమవారం సాయంత్రం మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు నడుమ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు ముందస్తు ప్రణాళికలు రూపొందించినప్పటికీ... ఈసారి ఊరేగింపు ఆలస్యమైందనే చెప్పాలి. భవిష్యవాణి అనంతరం మాతేశ్వరీ ఘటాల ఊరేగింపునకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం ప్రారంభమైన అక్కన్న, మాదన్నల దేవాలయ ఘటం సాయంత్రం 6.45 గంటలకు చార్మినార్‌కు చేరుకుంది. 7 గంటలకు ఊరేగింపులోని కొంత భాగాన్ని హిమ్మత్‌పురా చౌరస్తా వద్ద నిలిపివేశారు. అనంతరం తిరిగి ఊరేగింపు కొనసాగింది. పోలీసులు సూచించిన విధంగా నిర్వాహకులు క్రమశిక్షణతో సహకరించడంతో ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేదు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. భక్తులు దారి పొడవునా ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు.  
 ఊరేగింపు సాగిందిలా....  బోనాల సందర్భంగా సోమవారం ఉదయం అన్ని ప్రధాన దేవాలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక  మీదుగా లాల్‌దర్వాజా సింహవాహిని ఘటాలతో కలిసింది. అక్కన్న, మాదన్న దేవాలయం, మురాద్ మహల్, గౌలిపురా, సుల్తాన్‌షాహి, హరిబౌలి ఘటాలు లాల్‌దర్వాజా మోడ్‌కు చేరుకున్నాయి. ఈ ఊరేగింపు శాలిబండ, హిమ్మత్‌పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్‌హౌజ్‌ల మీదుగా నయాపూల్ మూసీ నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన మహంకాళి అమ్మవారి ఘటం కోట్ల అలీజా, సర్దార్ మహల్ మీదుగా చార్మినార్ చేరుకొని ప్రధాన ఊరేగింపులో కలిసింది.  

ప్రముఖుల స్వాగతం... ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రాజ్, ప్రధాన కార్యదర్శి ప్యారసాని వెంకటేష్‌ల ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి  కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు డాక్టర్ భగవంత్ రావు తదితరులు ఘటాలకు స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు... మీరాలంమండి దేవాలయ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, బేలా ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు సదానంద్ యాదవ్‌లు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సుల్తాన్‌షాహి జగదాంబ దేవాలయ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, లాల్‌దర్వాజ సింహవాహిని దేవాలయంలో మానిక్‌ప్రభు గౌడ్, తిరుపతి నర్సింగ్‌రావు, అక్కన్న, మాదన్నల దేవాలయ కమిటీఅధ్యక్షులు జి.నిరంజన్ తదితరులు ఘటాలకుపూజలు చే శారు.
 
 

Advertisement
Advertisement