ఉన్నతస్థాయి సిఫారసుల మేరకే.. | Sakshi
Sakshi News home page

ఉన్నతస్థాయి సిఫారసుల మేరకే..

Published Wed, Aug 31 2016 2:02 AM

ఉన్నతస్థాయి సిఫారసుల మేరకే.. - Sakshi

- రాజధాని నిర్మాణ టెండర్ నిబంధనలు, అర్హతలకు రూపకల్పన
- హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఆర్‌డీఏ
 
 సాక్షి, హైదరాబాద్: మంత్రులు, సీనియర్ అధికారులు, ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసుల మేరకే రాజధాని నిర్మాణానికి సంబంధించిన టెండర్ నిబంధనలను, అర్హత విధానాలను రూపొందించామని సీఆర్‌డీఏ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. ఈ నిబంధనలు, విధానాల మేరకే స్విస్ చాలెంజ్ పద్ధతి అమలవుతుందని తెలిపారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసమే విదేశీ అనుభవాన్ని ఓ నిబంధనగా నిర్దేశించడం జరిగిందన్నారు. దీని వల్ల రాజధానిని కేవలం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడానికి వీలవడమే కాకుండా విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.

రాజధాని నిర్మాణం వంటి విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రాజెక్టులు పిటిషనర్ వంటి వ్యక్తుల సంతృప్తి మేరకు ఉండబోవని అన్నారు. కోర్టులో కేసు దాఖలు చేసి కాలాన్ని వెళ్లదీస్తూ విదేశీ భాగస్వామి కోసం అన్వేషిస్తున్నారని నివేదించారు. ప్రతిపాదిత వ్యయం, డెవలపర్‌కు లాభాలు తదితరాలన్నీ యాజమాన్య సమాచారం (ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్) కిందకే వస్తాయని చెప్పారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీల కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సమర్పించిన ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ ఇటీవల టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ కంపెనీ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ బి.మల్లికార్జునరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ టెండర్ నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మల్లికార్జునరావు అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్ మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు.

 ప్రాజెక్టును నిలపొద్దు: బిడ్డింగ్‌కు పిటిషనర్ అర్హత సాధించే అవకాశాన్ని కల్పించేందుకు వీలుగా విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టును నిలిపివేయరాదని కౌంటర్‌లో విజ్ఞప్తి చేశారు.  బిడ్ దాఖలు చేసేందుకే అర్హతలు లేని వ్యక్తి టెండర్ నిబంధనల గురించి మాట్లాడుతున్నారని, దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకుని  విచారణార్హతపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Advertisement
Advertisement