దశలవారీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు | Sakshi
Sakshi News home page

దశలవారీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

Published Sat, Jan 7 2017 2:20 AM

Phase of the joint entrance examinations

మొదట పీజీ ఈసెట్,ఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు
ఉన్నత విద్యా మండలి నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)ను దశలవారీగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో పీజీ ఈసెట్, ఈసెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్‌ చాన్స్‌లర్ల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం పీజీ ఈసెట్, ఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని నిర్ణయించారు.

వాటి ఫలితాలను చూశాక ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనం  ఖర్చుతో కూడుకున్నదని, ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పీజీలో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కొన్ని సబ్జెక్టులను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, మరికొన్ని సబ్జెక్టులకు కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయే సబ్జెక్టుల్లో ఎవరెవరు ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న అంశాలను తేల్చేందుకు రెండు యూనివర్సిటీల వీసీల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో సమస్యలు తలెత్తకుండా 2017–18 విద్యా సంవత్సరంలో పక్కా చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రతి యూనివర్సిటీలో హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు ఒక కోఆర్డినేటర్‌ను నియమించాలని నిర్ణయించారు.   గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి యూనివర్సిటీలో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించి ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement