పురాతత్వ పరిశోధనలకు.. ఆర్కియాలజీ | Sakshi
Sakshi News home page

పురాతత్వ పరిశోధనలకు.. ఆర్కియాలజీ

Published Fri, Jul 11 2014 12:09 AM

పురాతత్వ పరిశోధనలకు.. ఆర్కియాలజీ

 అప్‌కమింగ్ కెరీర్

 గతం గురించి తెలుసుకొని, వర్తమానాన్ని దోషరహితంగా తీర్చిదిద్దుకున్న జాతి భవిష్యత్తే ఉజ్వలంగా ఉంటుంది. గత చరిత్రను తెలుసుకోవడానికి పరిశోధనలే కీలకం. అలాంటి పరిశోధనలు చేసేవారే ఆర్కియాలజిస్టులు. ప్రాచీన కాలం నాటి ప్రజల సామాజిక జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, ఉపయోగించిన వస్తువులు, పాత్రలు, ఆయుధాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు.. తదితర అంశాలను వెలికితీసి, ఆనాటి చరిత్రను ఈనాటి ప్రజలకు తెలియజేయాలనే ఆసక్తి ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్... ఆర్కియాలజిస్టు. ఈ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండడంతో యువత ఆర్కియాలజీ కోర్సులను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతోంది.
 
ఆర్కియాలజిస్టులు సాధారణంగా తమ విధుల్లో భాగంగా ప్రాచీన కట్టడాలు, శిథిలాలు, శిలాజాలు, ఆహార ధాన్యాలు, రాత ప్రతులు, వస్తు వులు, పరికరాలు, నాణేలు, ఆయుధాలు, ఆభరణాలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. వీటిని వెలికితీయాలంటే తవ్వకాలు జరపాలి. కాబట్టి ఆర్కియాలజిస్టులు ఎక్కువభాగం క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఆర్కియాలజీ కోర్సులు పూర్తిచేసినవారికి  ఆర్కియాలజిస్టులుగా, హెరిటేజ్ కన్జర్వేటర్లుగా, ఆర్కైవిస్టులుగా, ఎపిగ్రాఫిస్టులుగా, సైట్ గైడ్లుగా, క్యూరేటర్లుగా, కాలేజీలు/యూనివర్సిటీల్లో లెక్చరర్లుగా మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

 అర్హతలు:

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారెవరైనా ఆర్కియాలజీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాలో చేరొచ్చు. అయితే హిస్టరీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీ వంటి  వాటిలో గ్రాడ్యుయేషన్ చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది. పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టాలనుకొనేవారు హిస్టరీలో పీజీ చేసిన తర్వాత, ఆర్కియాలజీలో పీజీ చేయడం ఉత్తమం.

వేతనాలు

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఆర్కియాలజిస్టుకు ప్రారంభంలో నెలకు రూ.9 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం లభిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం అందుతోంది. ఆర్కియాలజిస్టుగా మంచి గుర్తింపు, అధిక వేతనం పొందాలంటే ఈ రంగంలో డాక్టరేట్ సాధించాలి.

 ఆర్కియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

•  ఉస్మానియా యూనివర్సిటీ
•   ఆంధ్రా యూనివర్సిటీ
•   డెక్కన్ కాలేజీ-పుణె
•    బనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
•    పాట్నా యూనివర్సిటీ
•  పంజాబ్ యూనివర్సిటీ
 
 
 చరిత్రను వెలికి తీయడంలో కీలకపాత్ర

 ‘‘ఒక దేశ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలను వెలికి తీయడంలో ఆర్కియాలజిస్టులదే కీలకపాత్ర. ఎక్కడో భూమి పొరల్లో దాగిన చారిత్రక విశేషాలను, వాస్తవాలను వెలికితీసి ప్రపంచానికి చాటడాన్ని గర్వకారణంగా భావించాలి. పరిశోధనల్లో భాగస్వాములు కావాలనుకునే యువతకు ఇది మంచి కెరీర్. కేవలం పాతతరం కోర్సుగా కాకుండా ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. ఆర్కియాలజీ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. మ్యూజియాల్లో, పురాతత్వ ప్రదేశాల్లో సాంకేతిక నిపుణులుగా అవకాశాలు లభిస్తున్నాయి. అవకాశాలకు కొదవలేని కోర్సులు కాబట్టే.. గతంతో పోల్చితే యువత దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు’’
  
  - డాక్టర్ ఎన్.ఆర్.గిరిధర్, ఆర్కియాలజీ హెడ్,
     ఉస్మానియా విశ్వవిద్యాలయం
 

Advertisement
Advertisement