Sakshi News home page

మనసున్న చిత్రం

Published Tue, Aug 19 2014 12:38 AM

మనసున్న చిత్రం

అన్నిదానాల్లోకెల్లా.. అంటూ సాగే వాక్యంలో ఫొటోని కూడా చేర్చి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ‘హైదరాబాద్ వీకెండ్ షూట్స్’ క్లబ్ సభ్యులు. ఆరేళ్ల కిందట ఒకరికొకరు హాయ్ చెప్పుకున్న ఈ ఫొటోగ్రఫీ ప్రేమికులు ఏడాదికోసారి ‘హెల్ప్ పోట్రయిట్స్’ కార్యక్రమం నిర్వహిస్తూ పెద్దల మన్ననలు అందుకోవడమే కాదు.. పేదల హృదయాలనూ గెలుస్తున్నారు.   ..:: భువనేశ్వరి
 
మరుపురాని జ్ఞాపకాలను మనోహరంగా చూపేదే ఫొటో. అయిన వారికి ఆటవిడుపైన ఫొటో.. లేనివారికి మాత్రం అందని ద్రాక్షే. అలాంటి వారి గత స్మృతులను చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తున్నారు ‘హైదరాబాద్ వీకెండ్ షూట్స్’ క్లబ్ సభ్యులు. ‘హెల్ప్ పోట్రైట్స్’ పేరుతో ఉచితంగా ఫొటో తీసి వారి చేతులకందిస్తున్నారు. ‘ మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒక్కరోజు జరిగే ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 60 మంది వరకూ పాల్గొంటున్నారు. మా కెమెరా లెన్స్‌లు మనుషులనే కాదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని సంఘటనలు, సందర్భాలను బంధిస్తాయి. వాటిని అందంగా చిత్రించి కావాల్సినవారి చెంతకు చేరుస్తాం. నేనొక్కడినే ఇప్పటి వరకు 400 ఫొటోలను పంచాను’ అని చెబుతున్నారు చంద్రశేఖర్‌సింగ్ అనే బ్యాంక్ ఉద్యోగి. ఈయన ఆధ్వర్యంలో గతేడాది రంగారెడ్డి జిల్లాలోని స్ఫూర్తి అనాథాశ్రమం పిల్లల ఫొటోలు తీసి వారికి ఉచితంగా పంచారు. అంతేకాదు, వారికి తోచిన సాయం కూడా అందించారు.

జాబ్ సాటిస్‌ఫాక్షన్..

హైదరాబాద్ వీకెండ్ షూట్స్ క్లబ్‌లో దాదాపు ఆరు వేల మంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఫొటోగ్రఫి ప్రవృత్తిగా ఉన్న అన్ని వృత్తులవారూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ట్రావెలింగ్, నైట్ ఫొటోగ్రఫీ, నేచర్, వెడ్డింగ్స్, స్పోర్ట్స్, వైల్డ్‌లైఫ్.. ఇలా రకరకాల అభిరుచులు కన్నుగీటిన చిత్రకదంబం.. నెటిజన్లకు ప్రపంచాన్ని మరింత దగ్గరగా చూపిస్తోంది. ఫొటోగ్రఫీ వేదికపై కలుసుకున్న వీరంతా స్నేహితుల్లా మారిపోయారు. హెల్ప్ పోట్రైట్స్ పేరుతో వేలాది మందికి తీపి జ్ఞాపకాలు పంచుతున్నారు. అంతేకాదు వీరంతా కలసి మారథాన్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

మధుర క్షణాలు..

హాబీకి సేవను జోడించి చేస్తున్న హెల్ప్ పోట్రైట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఫొటోగ్రాఫర్లు వారి జీవితంలో అది ప్రత్యేకమైన రోజంటారు. ‘2013లో హెల్ప్ పోట్రైట్స్ కోసం ఉత్తరప్రదేశ్‌లోని మధుర వెళ్లాను. అక్కడ వితంతువుల ఫొటోలు చాలా తీశాను. మా ఫొటోలు
 
ఎందుకని వారంతా ప్రశ్నించిన వారికి నా సమాధానం కన్నీళ్లు తెప్పించింది. ‘మీరు.. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉందమ్మా.. మీకేం అభ్యంతరం లేకపోతే.. మీ ఫొటోలు తీసి మీకే ఇస్తాను’ అన్నాను. దాదాపు వంద మందిని ఫొటోలు తీశాను. ఆ కాపీలను ఇస్తుంటే వారికళ్లలో కనిపించిన ఆనందం ఎప్పటికీ మరచిపోలేను’ అని ఆనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు ఐటీ ఉద్యోగి భాస్కర పరిమళ. ‘గతేడాది కుంభమేళలో తీసిన ఫొటోలు ఉచితంగా పంచినపుడు నేను ఇలాంటి అనుభూతినే పొందాన’ని మరో ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

నగరంలో వీధి వీధి..

హెల్ప్ పోట్రైట్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో దాదాపు 130 ప్రాంతాలు తిరిగామని చెప్పారు చంద్రశేఖర్. మురికివాడల్లోని గుడిసెలు.. అక్కడ వారి జీవితం ఫొటోల్లో సహజంగా ప్రతిబింబించాయని తెలిపారు. ‘పాతబస్తీ, ఇతర మురికివాడలకు వెళ్లినపుడు కనిపించిన చిన్నారుల ఫొటోలు తీశాం. అవి వారికిస్తున్నప్పుడు చిన్నారుల మోముల్లో కనిపించిన సంతోషం మా సంకల్పానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింద’ని  చె ప్పారు చంద్రశేఖర్. తీసిన ఫొటోలు దాచుకోవడం కంటే.. వాటిని పది మందికి  పంచి ఆనందాన్ని క లిగిస్తున్న వీరికి మరిన్ని తీపి గుర్తులు కంటపడాలని కోరుకుందాం.
 
 
అనుభవాలే పుస్తకంగా..
 
గోల్కొండ కోట అందాలు.. చార్మినార్ ఠీవిని క్లిక్ మనిపించిన జ్ఞాపకాలు.. బుట్టమీద ముడుచుకున్న కోడిపిల్లను కెమెరాలో బంధించిన అనుభవాలు.. ఇప్పటికీ ఫ్లాష్ కొడుతుంటాయి. పాఠశాల విద్యతో ముగిసిన నా చదువు.. ఎంచుకున్న రంగంలో పీహెచ్‌డీ పట్టా అందించిదన్న ఫీలింగ్ కలుగుతుంది. కాలంతో మారుతున్న లెన్స్‌లను అవగాహన చేసుకోవడమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. మూడు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ మూలాలే మారిపోయాయి. తొలినాళ్లలో సహజత్వం నుంచి అద్భుత చిత్రాలు సృష్టించే వాళ్లం. ఇప్పుడు ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి వస్తున్న వాళ్లు.. వాళ్లకు వాళ్లే ముస్తాబై వస్తున్నారు. ఫొటోగ్రఫీపై ప్రత్యేక కోర్సులు బోధించడం మంచి పరిణామం. అయితే అనుభవం ముఖ్యం. దీన్ని గుర్తించి 35 రంగాల్లో ఫొటోగ్రఫీకి అవసరమైన మెళకువకులతో పుస్తకాన్ని రచించాను. జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఈ పుస్తకాన్నే అనుభవ పాఠాలుగా తీసుకుంది.మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో బాల కార్మికుల జీవితాలను ప్రతిబింబించే ఫొటోలు జాతీయ స్థాయిలో ఆకట్టుకోవడం కేరీర్‌లో మరో గర్వించదగ్గ అంశం. ఇప్పటికీ ఆరు లక్షల ఫొటోలు తీసినప్పటికీ, భాషాపరమైన సమస్య వెంటాడుతోంది. ఈ కారణంగా రావాల్సిన గుర్తింపు రాలేదనే భావిస్తున్నాను. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటేనే ఫొటోగ్రాఫర్ రాణిస్తాడు. కళ్ళల్లోనే దృశ్యం కట్టిపడే తత్వం అలవర్చుకోవడం వల్లేమో... అంతా నన్ను ఐరిస్ సత్యం అని పిలుస్తారు. వృత్తే ఇంటి చిరునామా కావడం ఆనందంగానే ఉంది. కాసుల కోసం కాకుండా, పనితనాన్ని కనబరచే ఫొటోగ్రాఫర్లే సమాజానికి అవసరం.
 - ఐరిష్ సత్యం (సీనియర్ ఫొటోగ్రాఫర్)
 
స్టిల్.. స్కిల్స్ ప్రధానం
 
సినీ ఫీల్డ్‌లో పోటీ విపరీతంగా ఉంటుంది. ఈ వాతావరణంలో హీరో శోభన్‌బాబు స్వీయానుభవ పాఠాలు నా జీవితాన్ని మార్చేశాయి. సినీ వీడియోగ్రాఫర్ అవ్వాలని సిటీకొచ్చిన నేను, స్టిల్ ఫొటోగ్రాఫర్‌ను అయ్యాను. ఇండస్ట్రీ హైదరబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ నా కొడుకుకు ఉన్నత విద్య అందించాను. ఇప్పుడు వాడు లండన్‌లో రీసెర్చ్ చేస్తుండటం నాకు సంతోషాన్నిస్తుంది. స్టిల్ ఫొటోగ్రఫీలో ఎన్నో మార్పులొచ్చాయి. నటుల మనోభావాలు అర్థం చేసుకుని ముందుకెళ్తేనే రాణించగలం. దీంతో పాటు టెక్నాలజీని ఒడిసిపట్టే స్కిల్స్ ఉండాలి.. అప్పుడే ఈ రంగంలో క్లిక్ అవుతారు.    
 - జి నారాయణరావు (సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్)
 
ఫొటోల్లో  మానవీయ కోణం
 
 ఫొటోగ్రాఫర్‌కు మానవీయ కోణం ఉండాలి. తీసే ప్రతీ ఫొటో సజీవ చిత్రమై జనంలోకి వెళ్లాలి. బాబ్రీ మసీదు ఘటన సందర్భంగా తీసిన ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. లాతూర్ భూకంపం ఫొటోలు విశాధగీతికను వినిపించాయి. అందుకోసం నా సర్వ శక్తులు ఒడ్డాను. తిండిలేని రోజులు ఉన్నాయి.. నిద్రలేని రాత్రులున్నాయి.. కాలినడకన మైళ్ల దూరం నడిచిన జ్ఞాపకాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నాకున్న ఇబ్బందులు ఎవరికీ తెలియకపోయినా.. లాతూర్ ఫొటోలను చూస్తే నేనే గుర్తొస్తాను. నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి. నక్సల్స్ నేత కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ సందర్భంగా తీసిన ప్రతి ఫొటో సంచలనమైంది.  సంపాదన కోసం కాకుండా.. తాను తీసిన ఫొటో కలకాలం నిలిచిపోవాలనే కాంక్ష ఉండాలి.
 - రవీందర్‌రెడ్డి  (లాతూర్ ఘటన
 చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్)
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement