వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీ | Sakshi
Sakshi News home page

వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీ

Published Sun, May 1 2016 2:59 AM

వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీ - Sakshi

వెయ్యి ఏఈవో, 208 హెచ్‌ఈవో పోస్టులకు సీఎం ఆమోదం: పోచారం
 
సాక్షి, హైదరాబాద్:
వెయ్యి వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) పోస్టులతోపాటు 208 ఉద్యాన విస్తరణాధికారి (హెచ్‌ఈవో) పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారని, త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని మం త్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డిలతో కలసి సచివాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏడీఏ ఉండాలని నిర్ణయించామన్నారు.

సెరీకల్చర్‌లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను ఉద్యానశాఖలోకి మళ్లిస్తామని తెలిపారు. గతేడాది కంటే ఈసారి నైరుతి రుతుపవనాలు 8 శాతం అధికంగా ఉంటాయని, దాంతో అధిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోందన్నారు. ఇది వ్యవసాయానికి శుభసూచకమన్నారు. సాధారణంగా ఈ సీజన్‌కు 17.87 లక్షల టన్నుల విత్తనాలు అవసరమని, ఇప్పటికే 7.72లక్షల టన్నులు ముందస్తు నిల్వ లు ఉన్నాయని తెలిపారు. సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. పత్తి ఎగుమతులపై కేంద్రం సుంకం పెంచి, రాయితీలు తగ్గించినందు న పత్తి ధరలు తగ్గిపోతాయన్నారు. అందువల్ల పత్తి సాగును తగ్గించాలని, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలు వేయాలని రైతులకు సూచించారు.

ఉద్యానశాఖకు నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకుంటున్నామని, దాంతోపాటు మొత్తంగా రూ.1,300కోట్లు సూక్ష్మసేద్యానికి ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పసుపు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లు ఉంటే... సేలం రకం విత్తనంతో ఏకంగా 40 క్వింటాళ్లు దిగుబడి సాధించవచ్చని మంత్రి పోచారం తెలిపారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర రూ.10వేలు ఉందని... కొత్త రకం వంగడంతో రైతుకు ఎకరాకు రూ.2.30 లక్షల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసే సుగంధ ద్రవ్యాల పార్కుకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

Advertisement
Advertisement