ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎజెండా.. బంగారు భారత్‌! | Sakshi
Sakshi News home page

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎజెండా.. బంగారు భారత్‌!

Published Wed, Mar 7 2018 2:13 AM

Political agenda is preparing for the Federal Front - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు రాజకీయ ఎజెండా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా సమాన అభివృద్ధి లక్ష్యంగా, రైతులను, పేద వర్గాలను ఆదుకునే చర్యలతో ఎజెండాను రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అమలు చేసిన పథకాలను చూపి, గుజరాత్‌ మోడల్‌ నినాదంతో దేశ రాజకీయాల్లో సత్తా చాటారు. అదే తరహాలో ‘బంగారు తెలంగాణ’ఎజెండాను దేశవ్యాప్తంగా అమలు చేయడం లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎజెండాను సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో అమలవుతున్న ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామనే నినాదాన్ని ఎత్తుకోనున్నారు. ఈ ఎజెండాకు సంబంధించి సీఎం కేసీఆర్‌.. సీఎంవో అధికారులు, వివిధ రాష్ట్రాల్లోని సీనియర్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా అవసరమైన, ప్రభావం చూపగలిగే పథకాలను గుర్తించాలని కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లు సమాచారం. మొత్తంగా బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను దేశవ్యాప్తంగా అమలు చేసే లక్ష్యంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎజెండాను ప్రాథమికంగా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది.


ప్రాథమిక ఎజెండాలోని అంశాలివీ..
రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తున్న పన్నుల వాటాను 42 శాతం నుంచి 50 శాతానికి పైగా పెంచాలి.
స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా నిధులు పంపిణీ చేసే విధానాన్ని మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే స్థానిక సంస్థలకు నిధుల పంపిణీ జరగాలి.
కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధులను నిర్దిష్టంగా అదే పథకానికి ఖర్చు చేయాలనే నిబంధనలు తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను తమ ప్రాంత, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకునేలా అవకాశం ఉండాలి.
రక్షణ, విదేశాంగం, అంతర్గత భద్రత, కరెన్సీ నిర్వహణ వంటి కీలకమైన అం శాలు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలి. మిగ తా అంశాలన్నింటినీ రాష్ట్రాలకే కేటాయించాలి. ఉమ్మడి జాబితాలో ఉన్న దాదాపు అన్ని అంశాలను రాష్ట్రాలకే అప్పగించాలి.
రిజర్వేషన్ల శాతం నిర్ణయించే అధికారం రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి. జనాభాలోని ఆయా వర్గాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి.
తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాగా.. ప్రతి రాష్ట్రంలో ఒక భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలి. అక్కడి ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్ర నిధులతోనే నిర్మించాలి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చిన్న నీటి వనరులను పునరుద్ధరించాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి.
రాష్ట్రంలో అమలు చేయనున్న ఎకరానికి రూ.8 వేల వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని దేశమంతటికి విస్తరించాలి. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించాలి.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా ఉండాలి. దీనికి అవసరమైన మౌలిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
తెలంగాణలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అమలవుతున్న ‘కేసీఆర్‌ కిట్‌’తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రసూతి అనేది పేదలకు భారం కాకుండా, పేద మహిళలకు ఆరోగ్యపరంగానూ ఈ పథకం భరోసా ఇస్తుంది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి.
ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా అభివృద్ధి చేయాలి. దేశ వ్యాప్తంగా ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభు త్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దాలి.

Advertisement
Advertisement