మార్చిలో పోస్టల్ బ్యాంకులు | Sakshi
Sakshi News home page

మార్చిలో పోస్టల్ బ్యాంకులు

Published Mon, May 23 2016 2:38 AM

మార్చిలో పోస్టల్ బ్యాంకులు - Sakshi

- కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి
- మొదట ప్రధాన శాఖల్లో ఏర్పాటు
- తర్వాత దశల వారీగా విస్తరణ
- కేంద్రం పెట్టుబడి రూ.800 కోట్లు
 
 సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మక మార్పులతో పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న తపాలాశాఖ మరో పది నెలల్లో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే మార్చిలో తపాలా బ్యాంకులు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే భారత రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వగా తాజాగా కేంద్ర కేబినెట్ కూడా పచ్చజెండా ఊపటంతో తపాలా బ్యాంకుల ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆదివారం హైదరాబాద్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. తపాలా సర్కిళ్ల చీఫ్‌పోస్ట్‌మాస్టర్ జనరళ్ల జాతీయస్థాయి సదస్సు హైదరాబాద్‌లో జరిగింది.

మూడురోజుల ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తపాలా శాఖ బ్యాంకింగ్ రంగంలోకి రావాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజాగా అన్ని అనుమతులు రావటంతో అందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,55,939 తపాలా కార్యాలయాలున్నాయి. ఇందులో 29,560 ప్రధాన పోస్టాఫీసులు కాగా మిగతావి శాఖ కార్యాలయాలు. అన్ని ప్రధాన తపాలా కార్యాలయాలకు అనుబంధంగా వచ్చే మార్చిలో బ్యాంకులు ఏర్పాటు కాబోతున్నాయి. దశలవారీగా మిగతా చోట్ల ఏర్పాటు చేస్తాం’ అని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందులో కేంద్రం రూ.800 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందన్నారు.

 మోదీ ప్రభుత్వం వచ్చాక ఊపు
 కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తపాలా శాఖ గణనీయమైన ప్రగతి సాధించిందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. తాను ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకునేనాటికి దేశంలో కేవలం 4 తపాలా ఏటీఎంలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 913కు పెరిగిందని ఆయన తెలిపారు. 230 పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ సేవలుంటే వాటిని 21,664 తపాలా కార్యాలయాలకు విస్తరించామన్నారు.

 డాక్ సేవక్‌ల వేతనాలు పెంచుతాం..
 ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆదివారం తపాలా ఉద్యోగ సంఘాల సమాఖ్య 11వ అఖిల భారత ఫెడరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తపాలా శాఖలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతామన్నారు. కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ గ్రా మీణ డాక్ సేవక్ సిబ్బం దికి కనీస వేతనాలను పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీఎంస్ జాతీయ అధ్యక్షుడు బి.ఎన్.రాయ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి రవిశంకర్, పోస్టల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు శర్మ, తెలంగాణ కార్యదర్శి ఎం.డి.బేగ్, నాయకులు లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి తపాలా సర్కిలే...
 రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా తపాలా సర్కిళ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో కేంద్రప్రభుత్వం అంతసుముఖంగా లేదని రవిశంకర్ ప్రసాద్ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన తపాలా సర్కిళ్ల విభజన జరగాలని లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే రెండు సర్కిళ్ల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, వాటి ఏర్పాటుకు యత్నిస్తానని తెలిపారు. కాగా, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రవిశంకర్ ప్రసాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ర్ట నేతలు సన్మానించారు. బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్.రామచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement