లోకేష్ ఒత్తిడితో ప్రదీప్కు టికెట్ | Sakshi
Sakshi News home page

లోకేష్ ఒత్తిడితో ప్రదీప్కు టికెట్

Published Mon, Jan 18 2016 4:12 PM

లోకేష్ ఒత్తిడితో ప్రదీప్కు టికెట్ - Sakshi

హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో పోలీసులు ముందు విచారణకు హాజరైన ప్రదీప్ చౌదరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన ప్రస్తుతం వెంగళరావు నగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ డివిజన్ నుంచి వేరొకరికి టికెట్ ఇవ్వాలని ఒత్తిడి రావడంతో పాటు ఈ స్థానం తమకు కేటాయించాలని బీజేపీ సైతం ఒత్తిడి తెచ్చింది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఒత్తిడి మేరకు చివరి క్షణంలో జోక్యం చేసుకుని తన సన్నిహితుడు ప్రదీప్ చౌదరి పేరు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో లోకేష్ తన సన్నిహితులకు పలువురికి టికెట్లు ఇప్పించుకున్నారు. అందులో ప్రధానంగా వి. ప్రదీప్ చౌదరి పేరు తొలి వరుసలో ఉండటం విశేషం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భారీ ఎత్తున డబ్బులు ఎరగా వేసి కొనుగోలు చేయడానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ భారీ ఎత్తున డబ్బు తరలించడంపై అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. కాల్ లిస్ట్ ఆధారంగా ప్రదీప్ చౌదరి నంబర్ నుంచి కూడా అనేకసార్లు ఫోన్ సంభాషణలు ఉన్న నేపథ్యంలో ఆయనను పిలిచి విచారించారు.

తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అనేకసార్లు విబేధాలు పొడచూపాయి. తమకు గెలిచే అవకాశాలున్న డివిజన్లు టీడీపీ కోరడంపై బీజేపీలో అసంతృప్తి వ్యక్తమైంది. అందులో భాగంగా వెంగళరావునగర్ డివిజన్ నుంచి పోటీ చేయాలని బీజేపీ భావించినప్పటికీ లోకేష్ జోక్యంతో ఆ స్థానాన్ని వదులుకోవలసి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి ప్రదీప్ పేరును మాత్రమే పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించడంతో ఆయన టికెట్ ఖాయమైనట్టు టీడీపీ నగర నేతలు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement