ఆస్తి కోసం పిన్ని చిత్రహింసలు పెడుతోంది.. | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం పిన్ని చిత్రహింసలు పెడుతోంది..

Published Tue, Mar 7 2017 2:14 PM

Property harassment by stepmother

హైదరాబాద్‌: తనకు పిన్ని నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ బాలిక మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ముంబైకి చెందిన తాను తల్లిదండ్రులు చనిపోవటంతో పిన్ని వద్ద ఉంటున్నట్లు ఆమె తెలిపింది. తన తల్లిదండ్రుల పేరిట ఉన్న కోట్లాది రూపాయల ఆస్తిని కాజేయటానికి బెంగళూరు తీసుకెళ్లి.. రెండేళ్లుగా చిత్రహింసలు పెడుతోందని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. చిన్నమ్మ నుంచి ప్రాణహాని ఉందని, రక్షించాలని మానవ హక్కుల సంఘానికి వినతి అందజేసింది.
 
వివరాలు.. ముంబాయి జోగేశ్వరి ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక అలీనా ఖాన్ తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలీనా ఖాన్ తండ్రి సలీంఖాన్ మార్బుల్ వ్యాపారం చేసేవాడు. తను కూడపెట్టిన కోట్ల రూపాయల ఆస్తిని కూతురు పేరు మీద రాశారు. ఇది గమనించిన తన చిన్నమ్మ అర్షియా బాలికను చేరదీసింది. ముంబాయి లో ఉన్న బాలికను రెండేళ్ల క్రితం బెంగుళూరుకు తీసుకువచ్చింది. బాలిక పేరు మీద ఉన్న కోట్ల రూపాయాల ఆస్తిని కాజేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగానే రెండేళ్ల నుంచి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా.. అనేక సార్లు హత్యాప్రయత్నం కూడా చేసింది. ఇది భరించలేక ఆ బాలిక ఫేస్ బుక్ ద్వారా తన స్నేహితుడు సహాయంతో హైదరాబాద్ నగరానికి వచ్చింది.
 
న్యాయం కోసం పౌర హక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు, ప్రముఖ న్యాయవాది జయ వింధ్యాలను కలిసి జరిగిన విషయం తెలిపింది. ఆగష్టు నెల నిండితే బాలిక మేజర్ అవుతుందని..అప్పటి వరకు ఆమెకు రక్షణ కల్పించాలని జయ వింధ్యాల.. బాలికతో వచ్చి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తన ఆస్తి కోసం  చిత్ర హింసలకు గురి చేసిన చిన్నమ్మ అర్షియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ బాలికకు రక్షణ కల్పించాలని నగర పోలీసులను ఆదేశించింది. 
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement