కాంక్ష ఉన్నా.. ఆంక్షల నిర్బంధం | Sakshi
Sakshi News home page

కాంక్ష ఉన్నా.. ఆంక్షల నిర్బంధం

Published Sun, Apr 23 2017 3:29 AM

కాంక్ష ఉన్నా.. ఆంక్షల నిర్బంధం - Sakshi

- స్వాతంత్య్రోద్యమ సమయంలో నివురుగప్పిన నిప్పులా ఉస్మానియా
- ఉద్యమాలు, నిరసనలకు వ్యతిరేకంగా నిజాం ఫర్మానా
- వందేమాతరం ఉద్యమంతో నిరసనలు
- వందలాది మంది విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు
- స్వాతంత్య్రం వచ్చిన రోజున నిశ్శబ్దంగా యూనివర్సిటీ
- భారత్‌లో విలీనం కావాలన్న ఆంక్షలపైనా దిగ్బంధం  


బ్రిటీషు వారి నుంచి, నిజాం రాచరికం నుంచి స్వాతంత్య్రం పొందాలన్న కాంక్ష ఎంతగా ఉన్నా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంక్షల నిర్బంధంలో ఉండిపోయింది. స్వాతంత్య్రోద్యమం గురించి కనీసం మాట్లాడడమూ తప్పేనంటూ నిజాం జారీ చేసిన ఫర్మానాతో విద్యార్థుల్లో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. వందేమాతరం ఉద్యమ సమయంలో విద్యార్థులు దిగ్బంధాన్ని మీరి నిరసనలు తెలిపారు. వందలాది మంది విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్‌ చేసి, అణచివేశారు. ఇక స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనూ యూనివర్సిటీ స్తబ్ధంగా ఉండిపోయింది. ఆ విశేషాలపై ప్రత్యేక కథనం..

మహ్మద్‌ మంజూర్‌

దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి హైదరాబాద్, జూనాగఢ్, జమ్మూకశ్మీర్‌ సంస్థానాలు ప్రత్యేకంగానే కొనసాగాయి. 200 ఏళ్ల బ్రిటీషు పాలన నుంచి స్వేచ్ఛ లభించిందని దేశవ్యాప్తంగా సంబరాలు, జెండా పండుగ జరుపుకొన్నా.. ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. 1947 ఆగస్టు 15వ తేదీ శుక్రవారం వచ్చింది, హైదరాబాద్‌ సంస్థానంలో శుక్రవారం వారాంతపు సెలవు. అంతేకాదు అప్పుడు రంజాన్‌ నెల జుమ్మతుల్‌ విదా, రంజాన్‌ జాగారం రాత్రి (రంజాన్‌ చివరి శుక్రవారం, దానిముందు రోజు లైలతుల్‌ ఖదర్‌) ఉంది. దాంతో ఓయూ హాస్టల్‌లో కొంత మంది విద్యార్థులు తప్ప ఎవరూ లేరు. దానితోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, నగర చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. తిరిగి ఉస్మానియాలో 19వ తేదీన తరగతులు ప్రారంభమయ్యాక మాత్రమే స్వాతంత్య్ర సాధనపై చర్చలు మొదలయ్యాయి. నిజాం పాలనలో ఉన్న కారణంగా జాతీయ జెండాను ఎగురవేయలేకపోయారు.

స్వాతంత్య్రోద్యమానికి..
అసలు బ్రిటీషు వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం రాకముందు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో స్వాతంత్య్రోద్యమంపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అంతేకాదు స్వాతంత్య్రానికి కొద్ది వారాల ముందు 1947 జూలై 30న విశ్వవిద్యాలయంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించొద్దంటూ.. స్వాతంత్య్రం అంశంపై మాట్లాడొద్దంటూ నిజాం ఫర్మానా జారీ అయింది కూడా. అయితే స్వాతంత్య్రానంతరం బ్రిటీషువారు స్వదేశీ సంస్థానాలు అటు పాకిస్థాన్‌లోగానీ, ఇటు భారత్‌లోగానీ చేరవచ్చని.. లేదా స్వతంత్రంగా ఉండవచ్చని సూచించారు. దీనిపై మాత్రం ఉస్మానియాలో ఆందోళన వ్యక్తమైంది. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్లు వెలువడ్డాయి. కానీ నిజాం ఫర్మానా కారణంగా విద్యార్థులు, అధ్యాపకులెవరూ బహిరంగంగా ఆందోళనలు వంటివి చేయలేకపోయారు.

‘వందేమాతరం’ ఉద్యమం ఊపు..
స్వాతంత్య్రోద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులు 1938లో వందేమాతరం నినాదాన్ని ఎత్తుకున్నారు. అప్పటికి  ఆర్ట్స్‌ కాలేజీ భవనం పూర్తికాలేదు. వర్సిటీ గన్‌ఫౌండ్రీలోనే కొనసాగుతోంది. అక్కడి కళాశాలలో ఓ రోజు ఉదయం ప్రార్థన సందర్భంగా కొందరు విద్యార్థులు వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత విద్యార్థులు స్వాతంత్య్ర పోరాటానికి అనుకూలంగా చర్చలు నిర్వహిస్తూ, వందేమాతరం ఆలపించారు. అయితే బ్రిటీషు ప్రభుత్వానికి నిజాం విశ్వాసపాత్రుడు కాబట్టి, ఉస్మానియాలో వందేమాతరం ఆలపించవద్దంటూ నిషేధం విధించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి అనుకూలంగా నిరసనలు చేపట్టవద్దని ఆదేశించారు. దీనిపై విద్యార్థుల నుంచి  నిరసన వ్యక్తమైంది.

హైదరాబాద్‌తో పాటు జిల్లాలు, తాలూకాల్లోనూ విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఉస్మానియాలో  350 మంది విద్యార్థులను.. జిల్లాలు, తాలూకాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 2 వేల మంది విద్యార్థులను సస్పెండ్‌ చేశారు.  ఓయూలో సస్పెండైనవారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉన్నారు. కొందరు నాయకులు జోక్యం చేసుకోవడంతో.. విద్యార్థులపై సస్పెన్షన్‌ తొలగించారు. కానీ స్వాతంత్య్ర ఉద్యమ భావజాలం ఉన్న చాలా మంది విద్యార్థులు దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు తరలి వెళ్లారు. అలాంటి వారికి నాగ్‌పూర్‌ వర్సిటీ స్వాగతం పలికింది. ఆ విద్యార్థులంతా అక్కడ వందేమాతరం ఉద్యమాన్ని కొనసాగించారు.

Advertisement
Advertisement