నవీన భారత నిర్మాత పీవీ

1 Jul, 2016 04:04 IST|Sakshi
నవీన భారత నిర్మాత పీవీ

ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్
 
 సాక్షి, హైదరాబాద్: నవ భారత నిర్మాత పండిట్ నెహ్రూ అయితే, నవీన భారత నిర్మాత మన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో, పెంగ్విన్  పబ్లికేషన్స్ ప్రచురణ సంస్థల నేతృత్వంలో హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ‘నరసింహుడు’, ‘హాఫ్ లయన్’ పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమతుల్యతను సాధించిన వారెవరైనా ఉన్నారంటే అది పీవీయేనని ఆయన స్పష్టం చేశారు.

భారత హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పీవీ నర్సింహారావుపై ఆయన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోరనే అభాండం వేశారని, కానీ ఆయనంత వేగంగా నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మరొకరు లేరన్నారు. మాజీ ఐఏఎస్ పీవీఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ పీవీ జీవితం రాజకీయవేత్తలకు ఓ సందేశం అన్నారు. సీబీఐ మాజీ డెరైక్టర్ విజయ రామారావు మాట్లాడుతూ అయోధ్య ఘటనలో పీవీ నర్సింహారావును నిందించడం సరికాదన్నారు. రచయిత వినయ్ సీతాపతి మాట్లాడుతూ భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన మహానుభావుడి గురించి ఈ పుస్తకం రాయడం తనకు గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.

 పీవీని గుర్తించే సమయం ఆసన్నమైంది
 పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల అమలుతో పాటు అణ్వాయుధ తయారీలో ఎంతో నిగూఢంగా వ్యవహరించారన్నారని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. మార్గరెట్ థాచర్, డెంగ్‌తో సమానంగా పీవీని గుర్తించే సమయం ఆసన్నమైందని కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన ఎమెస్కో విజయ్‌కుమార్ మాట్లాడుతూ పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల ఫలితమే నేటి భారతమన్నారు.

పెంగ్విన్ సీనియర్ ఎడిటర్ రజని మాట్లాడుతూ భారతీయ చరిత్రలో పీవీ స్థానాన్ని మననం చేసుకొనే సందర్భమిదేనన్నారు. . పీవీ ఆర్థిక సంస్కరణలను హర్షించలేని వారిలో తానూ ఒకరినని, అయినా చరిత్రలో పీవీ స్థానాన్ని చెరిపేయాలని ఎవరైనా అనుకుంటే అది సాధ్యం కాదని ఎడిటర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో ప్రధాన సంపాదకులు డాక్టర్ . చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన పనే అయినా రచయిత నిష్పాక్షికంగా, సమకాలీన ఆధారాలతో ఈ పుస్తకాన్ని మనకందించారన్నారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, టంకశాల అశోక్, కె.బి.గోపాలంలకు ఎమెస్కో విజయ్ కుమార్ కృత జ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు తన తండ్రితో అనుభవాలను నెమరేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా