రాజధాని క్వార్టర్ల నిర్మాణానికి కంపెనీ | Sakshi
Sakshi News home page

రాజధాని క్వార్టర్ల నిర్మాణానికి కంపెనీ

Published Tue, Apr 12 2016 1:17 AM

రాజధాని క్వార్టర్ల నిర్మాణానికి కంపెనీ

♦ రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలు
♦ మంత్రులు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు 2,586 క్వార్టర్లు కావాలి
♦ వీటి నిర్మాణానికి రూ. 1,102 కోట్లు అవసరమని అంచనా
♦ ఉద్యోగుల సొసైటీకి 99 ఏళ్లకు లీజుకు భూమి కేటాయింపు
 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి, వాటి నిర్వహణ కోసం అమరావతి భవన నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేయాలని కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తొలుత ఈ కంపెనీ నూరు శాతం సీఆర్‌డీఏ వాటాతో ఏర్పాటవుతుంది. తరువాత ఈ కంపెనీలో సీఆర్‌డీఏకు 50 శాతం, ప్రైవేట్ సంస్థకు 50 శాతం వాటా ఉండాలని పేర్కొంది. ఈ కంపెనీ ప్రభుత్వ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణను చేపడుతుందని, ఇందుకోసం అవసరమైన నిధుల్ని ప్రభుత్వ గ్యారెంటీతో ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తుందని సీఆర్‌డీఏ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. 

ఇతర వాణిజ్య సముదాయాల నిర్మాణాలను, నిర్వహణను కూడా చేపట్టే వీలుగా ఈ కంపెనీ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ కంపెనీకి అవసరమైన మూలధనాన్ని తామే సమకూర్చుతామని సీఆర్‌డీఏ పేర్కొంది. ప్రభుత్వ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి ప్రణాళికలను సవివరమైన డిజైన్లను ఆ కంపెనీయే చేయనుంది. ఉద్యోగులు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన నిధుల్ని కూడా ఈ కంపెనీయే సమకూర్చుతుంది. ఆ తరువాత ఉద్యోగుల నుంచి వాయిదాల రూపంలో ఆ డబ్బును తిరిగి రాబట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సొసైటీకి  ప్రభుత్వం అంగీకరిస్తే రాయితీపై భూకేటాయింపునకు సీఆర్‌డీఏ ముందుకువచ్చింది.

 జడ్జిలు, మంత్రులకు క్వార్టర్ల నిర్మాణం
  రాజధాని అమరావతిలో జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాల్గోతరగతి ఉద్యోగుల నివాసానికి అవసరమైన క్వార్టర్ల నిర్మాణ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్‌డీఏ పంపింది. వివిధ కేడర్లకు చెందిన 16,000 మంది ఉద్యోగులు రాజధానిలో నివాసం ఉండాల్సి వస్తుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 16 శాతం మందికి 2,586 క్వార్టర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని పేర్కొంది. ఇందుకు రూ. 1,102 కోట్ల వ్యయం అవుతుందని  తెలిపింది.

ఈ క్వార్టర్లకు సంబంధించి మూడు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అవసరమైన క్వార్టర్లను సీఆర్‌డీఏ నిర్మాణం చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఇంటి అలవెన్స్ నుంచి సీఆర్‌డీఏకు వార్షిక చెల్లింపు (యాన్యుటీ) విధానంలో బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి. లేదంటే ఉద్యోగులే సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాలి. తామే నిర్మాణం చేసి ఇవ్వాలంటే హడ్కో నుంచి రుణం తీసుకుంటామని, ఆ రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని సీఆర్‌డీఏ పేర్కొంది.

 ఇళ్ల నిర్మాణానికి లీజుకు భూమి
 ఉద్యోగులు సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటే అందుకు అవసరమైన భూమిని సీఆర్‌డీఏ లీజుకు ఇస్తుంది. ఆ తర్వాత హక్కులను ఉద్యోగులకు కల్పిస్తుంది. ఇళ్ల నిర్మాణాలు మాత్రం అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో ఉండాలి. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికయ్యే నిధులను మార్కెట్ రేటు ప్రకారం  సమకూరుస్తుంది. ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల నుంచి వాయిదాలను మినహాయించి సీఆర్‌డీఏకు ఇవ్వాలి. ఉద్యోగుల గృహ నిర్మాణ సొసైటీకైతే అవసరమైన భూమిని 99 ఏళ్లకు లీజుకు ఇస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. ఇందుకు సొసైటీ సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఉద్యోగుల ఇళ్లకు అవసరమైన భూమిని చదరపు అడుగుకు ఏడాదికి ఒక రూపాయి నామమాత్రం లీజుకు ఇస్తామని  ప్రతిపాదించింది.

Advertisement
Advertisement