‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’ | Sakshi
Sakshi News home page

‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’

Published Fri, Sep 16 2016 6:49 PM

‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని, రాడికల్ యూనియన్‌లో పని చేసినప్పుడు సంబంధాలు ఉండేవని, తాను ముఖ్యమంత్రి కావాలని నయీం కోరుకునే వాడని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో శుక్రవారం అన్నారు.
 
ప్రభుత్వం చర్యను సమర్థిస్తున్నా

నయీం అరాచకాలు చేశారని, కాబట్టి ప్రభుత్వ చర్యను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు. నయీం కేసులో తన పైన ప్రభుత్వం బురద జల్లుతుందని చెప్పారు. తనకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇస్తే తాను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
 
నోటీసులు ఇస్తే వెళ్తా

తనకు సిట్ నోటీసులు ఇస్తే కచ్చితంగా మాట్లాడుతానని కృష్ణయ్య తెలిపారు. అయితే సిట్ దర్యాఫ్తులో పారదర్శకత లేదని, దీనిని సీబీఐకి అప్పగించాలని, రాజకీయ దురుద్దేశ్యంతో తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం నయీంతో కలిసినట్లుగా చెప్పడం సరికాదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి నాలాంటి నిజాయితీపరుడిపైన ఆరోపణలు చేయటం సరికాదని, తాను తన వాళ్ల కోసం పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదని కృష్ణయ్య అన్నారు. ఎల్పీ నగర్‌లో పోటీ చేసిన సమయంలో తనకు నయీం డబ్బులు పెట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తనలాంటి నిజాయితీపరులైన వారిని టార్గెట్ చేయడం విడ్డూరమన్నారు.

నయీంతో తనకు ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు సిట్ నిరూపిస్తే తాను చట్టపరమైన శిక్షకు సిద్ధమన్నారు. తనకు మాత్రం ఆర్థికపరమైన సంబంధాలు లేవని చెప్పారు. నయీం వ్యవహారంలో అధికార పార్టీ నేతలే 99 శాతం మంది ఉన్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నయీంతో సంబంధాలు కలిగిన వారిలో ఉన్నారన్నారు.
 
నయీంను బెదిరించా :
తన వద్దకు రోజుకు బాధల్లో ఉన్నవారు చాలామంది వస్తారని, వారి తరఫున తాను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పని చేస్తానని కృష్ణయ్య అన్నారు. అలాగే నయీం బాధితులు కూడా కొందరు తన వద్ద గోడును వెళ్లబోసుకున్నారని, వారి తరఫున నయీంకు ఫోన్ చేసి తిట్టానని చెప్పారు.
 
నయీం మరో ముగ్గురితో కలిసి లొంగిపోవాలనుకున్నాడని, ఈ విషయాన్ని తమకు చెబితే, లొంగిపోయినప్పుడు చూద్దామని చెప్పానన్నారు. నయీం చేసే దురాగతాలు తమకు అంతగా తెలియవన్నారు. తాను సీఎం కావాలన్నది నయీం కల అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నయీం తనకు సీఎం పదవి మిస్ అయిందని, తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని అతను కోరుకునేవాడన్నారు.

తాను గతంలో భువనగిరి ఉర్సు, వినాయక ఉత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. ఉద్యమం సమయంలోనే నయీంతో సంబంధాలు ఉన్నాయన్నారు. కొద్ది నెలల క్రితం అతనితో మాట్లాడానని, ఇక నయీంని కలవక చాలా రోజులు అవుతోందన్నారు. అయితే, గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని తమను టార్గెట్ చేయడం సరికాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement