'ఆయనలాంటి సీఎం దేశంలో మరొకరు లేరు' | Sakshi
Sakshi News home page

'ఆయనలాంటి సీఎం దేశంలో మరొకరు లేరు'

Published Tue, Feb 16 2016 1:44 PM

'ఆయనలాంటి సీఎం దేశంలో మరొకరు లేరు' - Sakshi

హైదరాబాద్ : కేంద్రం నుంచి కరవు సాయం తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ... నవంబర్లో పంపాల్సిన కరవు నివేదిక ప్రభుత్వం ముందుగా పంపి తప్పు చేసిందని విమర్శించారు.

ఇతర రాష్ట్రాలకు రూ. వందల కోట్ల కరవు సాయం చేసిన ప్రభుత్వం ఏపీకి మాత్రం రూ. 34 కోట్లే ఇచ్చిందన్నారు. కరవు, తుపానుల వల్ల రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని రఘువీరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ. 4 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గతంలోనే రాజధానికి భూమి పూజా, శంకుస్థాపన చేసిన ప్రభుత్వం మళ్లీ రూ. 200 కోట్లతో తాత్కాలిక రాజధాని నిర్మాణం ఎందుకు అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ నిధులతో రాజధానికి శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. చంద్రబాబును మించిన విలాసవంతమైన సీఎం దేశంలో మరొకరు లేదని ఎద్దేవా చేశారు.

రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. విజయవాడలో ఫిబ్రవరి 19న ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రదరత్నభవన్ ప్రారంభోత్సవం చేస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అదే రోజు దిగ్విజయ్సింగ్ ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ కానుందని వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని రఘువీరా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement