ఉత్తమ సేవలు..అత్యుత్తమ గుర్తింపు! | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలు..అత్యుత్తమ గుర్తింపు!

Published Wed, Feb 25 2015 11:44 PM

ఉత్తమ సేవలు..అత్యుత్తమ గుర్తింపు!

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్  ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ అవార్డు
సేవా ప్రమాణాలపై   {పశంసలు

 
సిటీబ్యూరో  ప్రయాణికులకు నాణ్యమైన, అత్యుత్తమ సేవలందజేయడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని  అనేక  విమానాశ్రయాలతో  పోటీపడుతూ  అవార్డుల పంట పండించుకుంటోంది. గత సంవత్సరం ‘రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎయిర్‌పోర్టు క్వాలిటీ సర్వీసు’ అవార్డును సొంతం చేసుకున్న ఆర్‌జీఐఏ ఈ ఏడాది  అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్)   నిర్వహించిన ఎయిర్‌పోర్టు సేవా ప్రమాణాల సర్వేలో మొదటి  మూడు స్థానాల్లో  నిలిచింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రతి ఏటా ప్రయాణికుల సదుపాయాలు, భద్రత, తదితర అంశాలలో  సేవా ప్రమాణాల సర్వేను నిర్వహిస్తుంది. ఈ సర్వేలో గత ఆరేళ్లుగా  ప్రపంచవ్యాప్తంగా  300 ఎయిర్‌పోర్టులతో పోటీపడుతూ  ఆర్‌జీఐఏ  మొదటి మూడు ర్యాంకుల్లో నిలవడం  విశేషం. ఈ ఏడాది 50 లక్షల నుంచి కోటీ 50 లక్షల మందికి  ప్రయాణ సదుపాయాన్ని అందజేసే  విమానాశ్రయం కేటగిరీ కింద  ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2009లో  నిర్వహించిన సర్వేలో 4.44 శాతం స్కోరు నమోదు కాగా, 2014 లో అది 4.82 కు  పెరిగింది. ఏటేటా ప్రపంచమంతటా కొత్త విమానాశ్రయాలు  ప్రారంభమవుతున్నాయి. పాతవి ఆధునీకరించుకుంటున్నాయి. అయినప్పటికీ  నాణ్యతా  ప్రమాణాల్లో జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఈ పోటీని ధీటుగా ఎదుర్కొని నిలవడం అతి పెద్ద విజయం.

కోటికి చేరువైన ప్రయాణికులు...

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  దేశ, విదేశీ ప్రయాణికుల రద్దీ సైతం అనూహ్యంగా పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు సుమారు 87 లక్షల మంది ప్రయాణికులు  ఈ  విమానాశ్రయం సేవలను వినియోగించుకున్నారు. మార్చి ఆఖరు నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకోవచ్చునని  జీఎమ్మార్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రయాణికులో 64 లక్షల మంది దేశీయ ప్రయాణికులు కాగా, మిగతా 22 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ఐదు  దేశీయ, 15 అంతర్జాతీయ విమానసర్వీసులు ప్రయాణికులకు సేవలందజేస్తున్నాయి. కోల్‌కత్తా, చెన్నై, విశాఖ,ముంబయి, బెంగళూరు వంటి దేశంలోని 27 ప్రధాన నగరాలకు, దుబాయ్, మస్కట్, లండన్, అబుదాబి, సింగపూర్ వంటి 20 అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
 
ఇది సమష్టి విజయం

గత ఆరేళ్లుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. జీఎమ్మార్ భాగస్వామ్య సంస్థలు, వివిధ కేటగిరీలలో పని  చేసే ఉద్యోగుల కృషి వల్లే ఇది సాధ్యమవుతోంది.రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అగ్రగామిగా  అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష.
 - ఎస్‌జీకె కిషోర్, సీఈవో, ఆర్‌జీఐఏ
 
 
 

Advertisement
Advertisement