టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు

Published Tue, Apr 26 2016 11:14 PM

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు - Sakshi

ఫైల్‌పై సంతకం చేసిన కేసీఆర్
వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు
బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా మల్లెపల్లి లక్ష్మయ్య

 
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ముందే నామినేటెడ్ పదవుల వడ్డన మొదలైంది. మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకంతో పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం మరో నలుగురికి కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేశారు.
 
 అలాగే తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని నియమించి కేబినెట్ హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అందుకే కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు స్వయంగా సీఎం చైర్మన్‌గా ఉన్నారు. కొత్తగా నియమించిన వైస్ చైర్మన్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 ఇక ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్‌రావును తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. కేబినెట్ హోదాతో పాటు ఈ పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుందని సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కో-ఆర్డినేటర్ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమిస్తూ పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను ఆకర్షించేలా బౌద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు స్పెషలాఫీసర్‌తో పాటు పాలకవర్గ కమిటీ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులతో ఈ కమిటీని నియమించే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించింది. తమకు బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రావు సచివాలయం లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement