చూసొద్దాం చలో..చలో.. | Sakshi
Sakshi News home page

చూసొద్దాం చలో..చలో..

Published Thu, May 14 2015 12:34 AM

చూసొద్దాం  చలో..చలో..

హైదరాబాద్‌కు 100 కి మీ పరిధిలోనే పర్యాటక కేంద్రాలు
సందర్శకులకు టి-టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
అందుబాటులో అత్యాధునిక వాహనాలు
 

శామీర్‌పేట్
 
హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య ఉన్న అందమైన ప్రాంతం.. శామీర్‌పేట్. సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న శామీర్ పేట సహజ సిద్ధమైన అందాలకు నెలవు. ఇక్కడ ఉన్న సరస్సు, జింకల పార్కు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. ఇక్కడ బస చేసేందుకు టూరిజం శాఖ హరిత రెస్టారెంట్ ఏర్పాటు చేసింది. బోటింగ్ సౌకర్యం, స్పా, జిమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.  
 
జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ.19
 
చిలుకూరు..
 
చిలుకూరులోని బాలాజీ టెంపుల్ మహిమ గల ఆలయంగా గుర్తింపు పొందింది. నగరం నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు హిమాయత్ సాగర్, గండిపేట్ ప్రాంతాలను కూడా చూడవచ్చు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుని ప్రతిరూపంగా ఇక్కడ బాలాజీ పూజలందుకుంటున్నారు.  
 
 జేబీఎస్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25
 
పెంబర్తి..
 
నాణ్యమైన కంచు పాత్రలకు పెట్టింది పేరు పెంబర్తి. నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ మారుమూల గ్రామం కాకతీయుల కాలం నుంచి ఇత్తడి, కంచు వస్తువుల తయారీకి ప్రత్యేక గుర్తింపు పొందింది. దీపారాధన, దేవతామూర్తుల విగ్రహాలు, లోహపు వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి.
 
జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 50
 
మెదక్ చర్చి

 
కాకతీయుల కాలంలో నిర్మించిన బలమైన కోటల్లో మెదక్ పోర్టు ఒకటి.  ఈ కోటకు ఉన్న మూడు ద్వారాలు, వాటి ముందు ఉండే ఏనుగుల బొమ్మలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. దీనికి సమీపంలోనే పురాతనమైన మెదక్ చర్జి ఉంది. ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన తెల్లగ్రానైట్ రాళ్లతో ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ చర్చిపై 175 మీటర్ల ఎత్తులో ఉన్న గంట ఇక్కడ ప్రత్యేకం. సుమారు 5 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది.
 
జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డినరి బస్సు రూ.54. ఏసీ బస్సుకు రూ. 73

 
 ప్రజ్ఞాపూర్
 
నగరానికి 65 కీమీ దూరంలో మెదక్ జిల్లాలో కరీంనగర్ హైవేలో ఉంది. భువనగిరి, జనగామ, సిద్ధిపేట్, వెళ్లే వారు ప్రజ్ఞాపూర్ వద్ద విశ్రాంతి తీసుకొని వెళ్తారు. ఈ ప్రాంతంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హోటళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి సమీపంలోని కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం ప్రఖ్యాతి పొందింది.
 
 సింగూరు
 
 నగరానికి 90 కిమీ దూరంలో మెదక్ జిల్లా సింగూరులో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు డ్యాం చూడదగినది. జంటనగరాలకు ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది. ఇందులో మొసళ్లు కూడా ఉన్నాయి.  
 
వేసవి సెలవుల్లో సేద తీరేందుకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొద్దామనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక, దర్శనీయ స్థలాలపై ప్రత్యేకంగా రూపొందించిన కష్టమైజ్డ్ ప్యాకేజీలను ఇప్పుడు టూర్ ఆపరేటింగ్ సంస్థలు, తెలంగాణ టూరిజం శాఖ అందిస్తున్నాయి. వాటిలో కొన్ని...
 
ట్యాంక్‌బండ్
 
నగర నడిబొడ్డున ఉండే అందమైన ప్రాంతం. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ తర్వాత హుస్సేన్ సాగర్ పై ఉన్న ట్యాంక్‌బండ్ గుర్తుకు వస్తుంది. ఈ సరస్సు మధ్యలో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన బుద్ధుని విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ఇందులో విహరించేందుకు బోటింగ్, పడవలు, క్రూజర్ సౌకర్యం ఉంది. సాయంత్రం వేళల్లో మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఈ ప్రాంతంలో విహరిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.
 
 బస్సు సౌకర్యం...
 
నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్ ప్రాంతానికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 లోపే.
 
 యాదగిరిగుట్ట...

 
తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నరసింహస్వామి కొలువైన ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని పంచ నరసింహ క్షేత్రంగా పిలుస్తారు. పర్యాటకులకు హరిత హోటల్స్, ఇతర వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
 
 జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డిన రి బస్సుకు రూ.44. శని,
ఆదివారాల్లో ప్రత్యేకంగా ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. చార్జి 101.  
 
భువనగిరి కోట...
 
క్రీస్తు శకం 1200 సంవత్సరంలో నిర్మించిన చాళుక్య కాలం నాటి కోట ఇక్కడ ప్రత్యేకం. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట 40 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో రెండు సరస్సులు ఉన్నాయి. కోటలోని భూ గృహాలు నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఉంటాయి. ఈ ప్రాంతం నల్గొండ నుంచి 53 కి.మీ దూరంలో ఉంది.
 
 జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఏసీ బస్సుకు రూ. 80, ఆర్డ్డినరి రూ. 35
 
 అనంతగిరి హిల్స్
 

 నగరానికి 75 కిమీ దూరంలో వికారాబాద్‌కు సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ ప్రత్యేకంగా వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. టూరిజం శాఖ ఇక్కడ హరిత రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది.
 
 జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.73
 
కీసరగుట్ట

 
 
నగర శివార్లలోని కీసర గుట్ట ప్రముఖ శైవక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో 101 శివలింగాలు ఉన్నాయి. నగరానికి చేరువలో ఉండటంతో నిత్యం యాత్రికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.
 
 జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ. 20
 
 గంగాపూర్
 
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లకు 8 కి.మీ దూరంలో ఉన్న గంగాపూర్ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని  రుణ బాధలు ఉన్నవారు ఎక్కువగా దర్శించుకుంటారు.  
 
 జేబీఎస్ నుంచి ప్రత్యేకంగా  బస్సు సౌకర్యం ఉంది. రూ. 85
 
నాచారం..
 
మెదక్ జిల్లాలో చూడదగ్గ ప్రాంతంలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలోని అసఫ్‌జాహీ జమామసీద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ యాత్రికులకు చక్కటి వసతులు ఉన్నాయి. పర్యాటకులు దీనితోపాటు నాచారం గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.
 
 జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది.  చార్జి రూ.65
 
వర్గల్ సరస్వతి ఆలయం..
 
సికింద్రాబాద్ నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. మెదక్ జిల్లా కంచి శంకర మఠం ప్రాంతంలోని ఈ ఆలయ సముదాయంలో విద్యా సరస్వతి, లక్ష్మీగణపతి, శనిచ్ఛంద్ర, వైష్ణవాలయాలు ఉన్నాయి. వర్గల్ సరస్వతి అమ్మవారి వద్ద చాలా మంది తమ పిల్లలకు అక్షరభాస్యం చేయిస్తుంటారు.
 
జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది.  చార్జి రూ. 32
 
అందుబాటులో  అత్యాధునిక వాహనాలు
 
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ టూరిజం శాఖ  ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు యాత్రికులు వెళ్లేందుకు సౌకర్యవంతమైన ఆధునాతన లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకటైన ‘కారవాన్’ ఏసీ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఏడు సీట్లు ఉంటాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సోఫా, బెడ్ కూడా ఉన్నాయి. వాహనంలోనే అటాచ్డ్ టాయిలెట్, రెండు ఎల్‌సీడీ టీవీలు, ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనానికి కనీస చార్జిగా కి.మీకు రూ. 25, రోజుకు 300 కి.మీ. వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు 300 అదనపు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఇన్నోవా కూడా అందుబాటులో ఉంది.  మరిన్ని వివరాలకు తెలంగాణ టూరిజం కార్యాలయంలో గాని, 9848125720,9848306435,9666578880, 9848540374, 9848126947 నంబర్లలో గాని సంప్రదించాలని జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు.
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement