‘రియల్’ నుంచి పేదలు ఔట్ ! | Sakshi
Sakshi News home page

‘రియల్’ నుంచి పేదలు ఔట్ !

Published Tue, Dec 15 2015 3:15 AM

‘రియల్’ నుంచి పేదలు ఔట్ ! - Sakshi

ప్రైవేటు గృహ సముదాయాల్లో పేదల వాటాకు చెల్లు
♦ 25% గృహాలు/ భవనంలో 10% కేటాయించాలన్న నిబంధనలు రద్దు  
♦ ‘క్రెడాయ్’ విజ్ఞప్తిపై సర్కారు సానుకూల స్పందన
♦ కొత్త భవన నిర్మాణ నియమావళికి కసరత్తు
♦ త్వరలో జీవో విడుదల
 
 సాక్షి, హైదరాబాద్: బిల్డర్లు, రియల్టర్లు నిర్మించే గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పేదలకు సైతం వాటాలు కల్పించాలనే నిబంధనలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ప్రైవేటు హౌసింగ్ ప్రాజెక్టుల్లో బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం గల సమూహా (ఎల్‌ఐజీ)లకు 25 శాతం గృహాలు లేక భవనంలో 10 శాతం ప్రాంతాన్ని కేటాయించాలన్న నిబంధనలను త్వరలో ఉపసంహరించుకోనుంది. ప్రత్యామ్నాయంగా బిల్డర్లు/రియల్టర్ల నుంచి పేదల గృహ నిర్మాణ అవసరాల కోసం నివాస రుసుం (షెల్టర్ ఫీజు)ను వసూలు చేయనుంది. స్థిరాస్థి వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య (క్రెడాయ్) చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో స్థిరాస్థి రంగ వ్యాపారాభివృద్ధికి అడ్డంకిగా మారిన నిబంధనలు సడలించాలని కోరుతూ ‘క్రెడాయ్’ ప్రతినిధులు గత నెల 28న సీఎం కేసీఆర్‌ను కలిశారు. భవన నిర్మాణ నియమావళిని ప్రకటిస్తూ పురపాలక శాఖ 2012లో జారీ చేసిన జీవో 168లోని కఠిన నిబంధనలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకృతం చేయాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సరళీకృత నిబంధనలతో కొత్త భవన నిర్మాణ నియమావళికి రూపకల్పన చేస్తోంది. స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై మరికొన్ని రోజుల్లో జీవో రానుంది.
 
 మినహాయింపులివీ...

► గ్రూపు హౌసింగ్ ప్రాజెక్టు స్థలం విస్తీర్ణం 5 ఎకరాలకు మించితే అందులో ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ వర్గాలకు 25 శాతం గృహాలు లేక భవనంలోని 10 శాతం ప్రాంతాన్ని బిల్డర్లు కేటాయించాలనే నిబంధనను రద్దు చేయనున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల్లోపు సైట్ల విషయంలో వసూలు చేస్తున్న షెల్టర్ ఫీజును.. 5 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సైట్లకు వర్తింపజేయనున్నారు.

► ఆకాశహర్మ్యాల నిర్మాణ ంపై ‘సిటీ లెవెల్ ఇంపాక్ట్ ఫీజు’లోనూ భారీ సడలింపులు ఇవ్వనున్నారు. చదరపు మీటర్‌కు జీహెచ్‌ఎంసీలో రూ.500 నుంచి 5,000, హెచ్‌ఎండీఏలో రూ.175 నుంచి 2,000 వరకు వివిధ స్లాబుల్లో ఈ ఫీజులను బాదుతుండగా.. ఇకపై కేవలం రెండు స్లాబుల్లో మాత్రమే వసూలు చేస్తారు. 17 అంతస్తుల వరకు ఓ స్లాబును, ఆపై మరో స్లాబును వర్తింపజేస్తారు.

► సైబరాబాద్ అభివృద్ధి ప్రాంతం (సీడీఏ)లో చదరపు మీటర్‌కు రూ.100 చొప్పున వాల్యూ అడిషన్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇకపై ఇవి ఉండవు.
► ఇక నుంచి 15 రోజుల్లో ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీ. లేకుంటే బాధ్యులపై చర్యలు.
► జీహెచ్‌ఎంసీ పరిధిలో సింగిల్ విండో విధానంలో భవన నిర్మాణ అనుమతులు. వివిధ శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
► గ్రూపు హౌసింగ్ పథకాల్లో అన్ని రోడ్లు, ఖాళీ స్థలాలను స్థానికపురపాలికకు గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధనను సైతం సడలించనున్నారు. కేవలం 10 శాతం ఖాళీ స్థలం గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోతుంది. అంతర్గత రోడ్లకు మినహాయింపు ఇవ్వనున్నారు.
► భవనాల్లో అదనపు నిర్మాణాల కోసం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)ను సైతం 200 నుంచి 250 శాతానికి పెంచనున్నారు.
► రోడ్డు విస్తీర్ణంలో స్థలం కోల్పోయిన వారికి భవన ముందు భాగంలో సెట్‌బ్యాక్ సడలింపులను ఇకపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ జారీ చేస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం అవసరం ఉండదు.
► రక్షణ, రైల్వే స్థలాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు ప్రస్తుతం రక్షణ, రైల్వే శాఖల నుంచి నిరంభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరి. ఈ నిబంధనను సైతం సడలించనున్నారు.
► ప్రస్తుతం మల్టిప్లెక్స్‌లపై అదనపు అంతస్తులకు అనుమతి లేదు. ఎత్తు 30 మీటర్లకు మించకూడదు. దీనిని సడలించనున్నారు.
►హెచ్‌ఎండీఏ/కుడా పరిధిలో భవన నిర్మాణ అనుమతులను గ్రామ పంచాయతీలతో సబంధం లేకుండా నేరుగా ఆయా సంస్థలే ఇవ్వనున్నాయి.

Advertisement
Advertisement