ఆరని జ్వాల | Sakshi
Sakshi News home page

ఆరని జ్వాల

Published Sat, Jan 23 2016 12:52 AM

ఆరని జ్వాల - Sakshi

గాంధీభవన్‌లో రెబల్స్ ఆందోళన
ఉత్తమ్ కుమార్‌రెడ్డి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
గాంధీభవన్‌కు తాళాలు నేతల తీరుపై అభ్యర్థుల నిరసన
 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించి.. భంగపడిన నేతలు అగ్ర నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారం గాంధీభవన్‌కు ఏకంగా తాళాలు వేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీ పీలోనూ నిరసన మంటలు రేగాయి. చిలుకానగర్‌లో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు.
 
నాంపల్లి:సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ దగా కోరు పార్టీగా మారిపోయిందని ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు ఆరోపించారు. శుక్రవారం నాంపల్లి గాంధీభవన్‌లో బి- ఫారం అందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్ ...ఉత్తమ్ కుమార్ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌కు వచ్చే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వీరిని నిరోధించేందుకు తొలుత కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌కు తాళాలు వేయగా..ఆ తరువాత నేతల తీరుకు నిరసనగా రెబల్స్ తాళాలు వేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  కోసం పడిగాపులు కాశారు. విసుగు చెందిన వీరంతా చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదంటూ బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా ముక్కూ మొహం తెలియని వారిని పోటీలో నిలిపారని ఆరోపించారు.

30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్నాను: శోభారాణి
గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల మహిళా కార్యకర్తగా పని చేస్తున్నాను. కార్యకర్తలు చిన్న చిన్న పదవులను ఆశిస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులను ఇవ్వమన్నా ఇవ్వరు. డివిజన్ స్థాయిలో జరిగే ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశం ఇవ్వకుంటే ఎలా? లంగర్‌హౌస్ డివిజన్ పార్టీ టికెట్ అడిగితే కార్వాన్ ఇన్‌చార్జి రూప్‌సింగ్ రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఎందుకని అడిగితే ఈ డబ్బులు దానం నాగేందర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం డబ్బు అడిగితే ఖర్చు చేసుకోగలం కానీ... జేబులు నింపడానికిఎక్కడ తెచ్చి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వనందుకు టికెట్ కేటాయించలేదు. బి-ఫారం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తే నకిలీది ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం? తప్పుడు బి-ఫారం ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై బేగంబజార్ పీఎస్‌లో ఫిర్యాదు చే శాను.

మాయ మాటలతో ఉపసంహరింపజేశారు: రేణు కేస్వాని
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనే భరోసాతో ఘాన్సీ బజార్‌లో నామినేషన్ వేశాను. ఉపసంహరణ నాటికి బీ ఫారాన్ని ఇతరులకు ఇచ్చేశారు. గాంధీభవన్‌లో ఇదేమని ప్రశ్నిస్తే మాజీ మంత్రి షబ్బీర్ అలీ దూతగా నావద్దకు వచ్చారు. ‘మీరు నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల’ంటూ ప్రాధేయపడ్డారు. ఆ తరువాత పత్తాలేకుండా పోయారు.
 
దగా కోరు పార్టీగా మారింది:పార్వతి శర్మ

కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి పదవులు ఇవ్వడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీలో కొనసాగుతుండటమే మేం చేసిన పెద్ద తప్పు. ఇతర పార్టీల్లో చేరిన వారు పెద్ద పదవుల్లో ఉన్నారు. సీనియర్ కార్యకర్తలను కాదని ఇతరులకు బి-ఫారమ్ ఎలా ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని అడిగేందుకు గాంధీభవన్‌కు వస్తే పత్తా లేకుండాపోయారు. ఉదయం నుంచీ వేచి ఉన్నాం. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement