వైన్‌పై వ్యాట్ తగ్గింపు! | Sakshi
Sakshi News home page

వైన్‌పై వ్యాట్ తగ్గింపు!

Published Sat, Dec 19 2015 12:12 AM

వైన్‌పై వ్యాట్ తగ్గింపు!

♦ రాష్ట్రంలో ‘వైన్’కు డిమాండ్ పెంచాలని భావిస్తున్న సర్కారు
♦ 150 శాతం నుంచి 70 శాతానికి వ్యాట్ తగ్గింపు ప్రతిపాదన
♦ కొత్త వైనరీలకు ప్రోత్సాహం.. మార్కెట్ కల్పించేందుకు నిర్ణయం
♦ త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త వైనరీలను ప్రోత్సహించడంతోపాటు ‘వైన్’ మత్తుపానీయానికి డిమాండ్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వైన్  అమ్మకాలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైన్‌పై 150 శాతం వ్యాట్ విధిస్తున్నారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే 750 ఎంఎల్ నాణ్యమైన ప్రీమియం వైన్ ఎంఆర్‌పీ రూ. 500 నుంచి రూ. 1,000కి రాష్ట్రంలో లభిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో వైన్‌పై వ్యాట్ తక్కువగా ఉండడం, వైనరీలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో వైన్‌ను ప్రోత్సహించేందుకు వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతం వరకు 3 స్లాబుల్లో తగ్గించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఈ మేరకు టీఎస్‌బీసీఎల్ జనరల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి ప్రతిపాదనలను కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ కూడా అమ్మకాలు పెంచడం ద్వారా ఆదాయం సమకూరితే వ్యాట్‌ను 80 శాతం తగ్గించేం దుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని భావిస్తున్నారు.

 రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే వైనరీ
 దేశ, విదేశాల్లో ‘వైన్’ది ప్రత్యేక స్థానం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎంపిక చేసిన ఉన్నతాదాయ వర్గాలు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే ఇతరులు ఎక్కువగా వినియోగిస్తారు. రాష్ట్రం లో నల్లగొండ జిల్లాలోని బీబీ నగర్ లో ఉసిరికాయతో వైన్ తయారు చేసే వైనరీని ఓ వ్యాపారి ఇటీవల ప్రారంభించాడు. ఇక్కడ వైన్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును మించి 150 శాతం వరకు వ్యాట్ విధిస్తుండడంతో మార్కెట్‌లో ఎంఆర్‌పీ తడిసి మోపెడవుతోంది. దీంతో సదరు కంపెనీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. వైన్‌లలో కూడా ఆర్డినరీ, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ఉత్పత్తిని ప్రోత్సహించి, వాటి ఉత్పత్తికి అనుకూలంగా మూడు స్లాబుల్లో వ్యాట్‌ను విధించాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే వైన్‌పై వ్యాట్ 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement